ఉగ్రవాదం చట్టబద్ధ పోరాటం అంటున్న పాక్ ఆర్మీ చీఫ్

ఉగ్రవాదం చట్టబద్ధ పోరాటం అంటున్న పాక్ ఆర్మీ చీఫ్
ఉగ్రవాదంను “చట్టబద్ధమైన పోరాటం” గా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అభివర్ణించారు. భారత్‌ అకారణంగా రెండు సార్లు పాకిస్థాన్‌పై దాడికి పాల్పడిందని అంటూ మరోసారి నోరు పారేసుకున్నారు. న్యూఢిల్లీకి వ్యూహాత్మక ముందుచూపు కొరవడిందని,  ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మళ్లీ తమపై దాడికి పాల్పడితే నిర్ణయాత్మకంగా ప్రతిస్పందిస్తామని మునీర్‌ హెచ్చరించారు. 
 
కరాచీలోని నేవల్‌ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మునీర్‌, ప్రాంతీయ స్థిరత్వాన్ని పాకిస్థాన్‌ కాపడుతోందని, అయితే భారత్‌ దుందుడుకు తనానికి పాల్పడితే తమ దేశం ప్రాంతీయశాంతిని దృష్టిలో పెట్టుకొని పరిపక్వంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేసే స్థితిలో పాక్‌ ఉంటే భారత్‌ ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ఆరోపించారు. అంతేకాక భారత్ చేతిలో హతం అయిన టెర్రరిస్టులను అమరవీరులుగా మునీర్ అభివర్ణించారు.

న్యూదిల్లీ నెట్‌వర్క్‌కు అఫ్గానిస్థాన్‌ వేదికగా మారిందనీ, అఫ్గాన్‌ వాసులతో కలిసి పాక్‌లో దాడులు చేస్తోందని ఆరోపించారు. భారత్‌ పోషిస్తున్న ఉగ్రవాదులకు అఫ్గానిస్థాన్‌ వేదిక ఇవ్వకూడదని కోరుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.మరోవంక, జూన్ 28 శనివారం రోజు వజీరిస్థాన్ లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనక భారత్ హస్తం ఉందని అసిమ్ మునీర్ నోరు పారేసుకున్నారు.

కాగా, వజీరిస్థాన్లో జరిగిన ఆత్మాహుతి దాడి వెనక భారత్ హస్తం ఉందన్న పాకిస్థాన్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవన్నీ తప్పుడు, నిరాధార ఆరోపణలని స్పష్టం చేసింది. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో భారత్పై నిందలు వేస్తూ పాక్ సైన్యం చేసిన అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఈ ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని భారత విదేశాంగశాఖ ప్రకటన విడుదల చేసింది. 

800 కిలోలు ఉన్న భారీ పేలుడు పదార్థాలున్న వాహనంతో వజీరిస్థాన్లో ఓ ఉగ్రవాది సైనిక కాన్వాయ్పైకి దూసుకెళ్లి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 మంది పాక్ సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పౌరులు, ప్రభుత్వాధికారులతో సహా 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పాకిస్థాన్ లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన ఉసూద్ -అల్ -హర్బ్ ఈ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆ దాడి వెనుక భారత్ హస్తం ఉందని పాక్ నిరాధార ఆరోపణలు చేసింది.