ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి

ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడి
రష్యా యుద్ధం మొదలైన నాటి నుంచి గతంలో ఎన్నడూ చేయనంత భారీ స్థాయిలో ఉక్రెయిన్‌ పై వైమానిక దాడులు చేసింది. గత రాత్రి రష్యా 477 డ్రోన్‌లు, 60 క్షిపణులు ఉన్నాయని ఉక్రెయిన్‌ వాయుసేన వెల్లడించింది. వాటిలో 249 డ్రోన్‌లను కూల్చేశామని, మరో 226 డ్రోన్‌లు ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ వ్యవస్థలవల్ల వాటంతటవే కూలిపోయాయని తెలిపింది.  
 
ఈ దాడిలో ఉక్రెయిన్‌కు చెందిన ఎఫ్‌-16 యుద్ధ విమానం ధ్వంసమైంది. దీంతో పైలట్ మరణించాడు. ఉక్రెయిన్‌లోని ఏడు వైమానిక స్థావరాలను రష్యా లక్ష్యంగా చేసుకున్నదని ఆ దేశ అధికారులు తెలిపారు. నివాస ప్రాంతాలను కూడా రష్యా విడిచిపెట్టడం లేదని ఆరోపించారు. స్మిలాలోని ఒక నివాస భవనంపై దాడిలో ఒక బాలుడు గాయపడినట్లు వెల్లడించారు.
 
ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమ్యూనికేషన్‌ కమాండర్‌ యూరీ ఇహ్‌నాట్‌ మాట్లాడుతూ గత రాత్రి అతిపెద్ద దాడి జరిగిందని తెలిపారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని రష్యా ఆయుధాలను ప్రయోగించినట్లు ఇహ్‌నాట్‌ చెప్పారు. పోలాండ్‌ గగనతల రక్షణ కోసం మిత్ర దేశాల యుద్ధ విమానాలు రంగంలోకి దిగినట్లు తెలిపారు. ఖెర్సాన్‌ ప్రావిన్సులో జరిగిన దాడుల్లో ఒకరు మరణించినట్లు అక్కడి గవర్నర్‌ వెల్లడించారు. 
కాగా రష్యాలో వేర్పాటువాదాన్ని పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని, ఉక్రెయిన్‌తో చేస్తున్న యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు.  రష్యా తాజా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అమెరికా మద్దతు, సహాయాన్ని కోరారు. ‘దురాక్రమణదారుడిపై ఒత్తిడి అవసరం. అలాగే రక్షణ కూడా అవసరం’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. 
ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేసేందుకు అమెరికా, పాశ్చాత్య మిత్రదేశాలు తక్షణం మద్దతు ఇవ్వాలని ఆయన అభ్యర్థించారు. అమెరికన్ రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్‌కు కొత్తగా ఎలాంటి సైనిక సహాయాన్ని ఆమోదించలేదు.