బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం

బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై అత్యాచారం

* కేసు ఉపసంహరించుకున్న బాధితురాలు!

బంగ్లాదేశ్ లో హిందూ మహిళపై హత్యాచారం కావించి, దానిని వీడియో తీసి షేర్ చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. 21 ఏళ్ల హిందూ మహిళపై స్థానిక రాజకీయ నేత ఒకరు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా ఢాకా విశ్వవిద్యాలయం విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ అమానుష ఘటన మురాద్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌చంద్రాపూర్ పంచకిట్ట గ్రామంలో జూన్ 26 రాత్రి జరిగింది. దీనిపై చర్యలతో పాటు మైనారిటీల భద్రతపై చర్చ మొదలైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, 36 ఏళ్ల ఫిరోజ్‌ అలీ అనే ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్‌పి) చెందిన వ్యక్తి బాధితురాలిని ఒంటరిగా చూసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యం గమనించిన కొంతమంది గ్రామస్థులు అతడిని పట్టుకున్నారు. కానీ, అలీ వారి నుంచి తప్పించుకొని పారిపోయాడు.  అత్యాచారం జరుగుతుండగా కొందరు దుర్మార్గులు బాధితురాలిని వీడియో తీశారు.

రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లి తలుపుకొట్టాడు. ఆమె తలుపు తీసేందుకు నిరాకరించడంతో తోసుకుని వెళ్లి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని పట్టుకుని చితకబాదారు. అయితే, వారి నుంచి అలీ తప్పించుకుని పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు జూన్ 27న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. 

కేసు నమోదు చేసుకున్న మురాద్‌నగర్ పోలీసులు.. ఉదయం 5 గంటలకు ఢాకాలోని సయదాబాద్ ప్రాంతంలో ఫిరోజ్‌ అలీని అరెస్టు చేశారు. అతడితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అమానుష ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ‘డైరెక్ట్ యాక్షన్’ తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు.

మరోవైపు, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పటి నుంచి హిందూ మైనారిటీలపై దాడులు పెరిగాయని స్థానికంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై బంగ్లాదేశ్ లోనే కాకుండా, భారత్ లో కూడా ఆగ్రవేశాలు వ్యక్తం కావడంతో బాధితురాలు ఆ కేసును ఉపసంహరించుకుంటున్న ట్లు ఆదివారం ప్రకటించారు. ఉద్రిక్తలు నివారించి, శాంతి కోసం ఆ విధంగా చేస్తున్నట్లు చెప్పారు. ఆమె ఫిర్యాదుతోనే పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. 

తనపై ఎవ్వరి వత్తిడి లేదని, భర్త సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఎట్లాగూ అవమానం జరిగింది గదా, కేసు కొనసాగిస్తే పోయిన అవమానం రాదు కదా అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఆ దారుణ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలు ఆ వీడియోలో వేడుకుంటూ కనిపించడం అందరినీ ఆందోళనకు గురిచేసింది.

కాగా, మైనారిటీ మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ‘సమ్మిలిత సనాతన్ పరిషద్’ ఆధ్వర్యంలో ఢాకాలో మానవహారం, ర్యాలీలు నిర్వహించారు.  అలాగే మహిళా హక్కుల కార్యకర్తలు పార్లమెంట్ సమీపంలో పెద్ద సంఖ్యలో నిరసనకు దిగారు. జూన్ 27న భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతను అక్కడి తాత్కాలిక ప్రభుత్వం అమలు చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.

ఇటీవలి దుర్గామాత ఆలయంపై దాడితో పాటు తాజా ఘటన మైనారిటీల భద్రతపై మళ్లీ చర్చ తెచ్చింది. ఆ వీడియోను సోషల్ మీడియా నుండి తొలగించాలని, బాధితురాలికి భద్రత కల్పించాలని బాంగ్లాదేశ్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే, ఆమె అభ్యర్ధన మేరకు ఆ కేసును పోలీసులు మూసివేస్తారా? లేదా? ఇంకా తెలియరాలేదు.