బిజెపి తెలంగాణ కొత్త సారథి రాంచందర్‌రావు

బిజెపి తెలంగాణ కొత్త సారథి రాంచందర్‌రావు
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు ఎన్నిక దాదాపు ఖరారైంది. పార్టీ విధేయుడిగా, సౌమ్యుడిగా గుర్తింపు పొందిన ఆయనకే సంఘ్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు మద్దతు ప్రకటించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ సైద్ధాంతిక నేపథ్యం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్నవారికే అధ్యక్ష పీఠం కట్టబెట్టడం సముచితమన్న అభిప్రాయాన్ని వారు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు.  
విద్యార్ధి దశ నుంచి ఏబీవీపీ, బీజేపీ యువ మోర్చా, బిజెపిలలో వివిధ హోదాల్లో రాంచందర్‌రావు పని చేసారు. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న అనేక సందర్భాల్లో రాంచందర్‌రావు మద్దతుగా నిలిచారు. పార్టీలోని అందరి నేతలతోనూ సత్సంబంధాలు కలిగిన నేతగా గుర్తింపు ఉంది. ఎమ్యెల్సీగా శాసనసమండలిలో బీజేపీకి పక్ష నాయకుడిగా వ్యవహరించారు.
 
1977 నుండి 80 వరకు రైల్వే డిగ్రీ కాలేజీలో బీఏ చదువుతూ 3 ఏళ్ల పాటు ఏబీవీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. పలు విద్యార్థి ఉద్యమాలకు నాయకత్వం వహించడమే కాకుండా రాడికల్ స్టూడెంట్స్ తో నేరుగా తలపడ్డ సందర్భాలెన్నో ఉన్నాయి. 1975 నుండి 95 వరకు తెలంగాణ పూర్తిగా మావోయిస్టులకు అడ్డగా మారిన సమయం. రాడికల్స్ హవా నడుస్తున్న సమయంలోనే వారికి ఎదురొడ్డి పోరాడిన నాయకుడు రామచంద్రావు. 
 
ఉస్మానియా వర్శిటీ లైబ్రరీలో రామచంద్రరావు ఉన్న సమయంలో ఏకంగా నక్సలైట్లు అక్కడికి వచ్చి ఆయనపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా కాళ్లు, చేతులు విరగ్గొట్టి వెళ్లారు. దాదాపు రెండు నెలలపాటు ఆసుపత్రిలో మంచానికే పరిమితమైన రామచంద్రరావు ఆ తరువాత రాడికల్స్ కు వ్యతిరేకంగా మరింత ఉధ్రుతంగా పోరాటాలు చేశారు. విద్యార్ధుల పక్షాన ఉద్యమాలు చేసిన రామచంద్రరావుపై అటు రాడికల్స్ తో పాటు ఇటు పోలీసుల చేతిలోనూ పలుమార్లు లాఠీ దెబ్బలు తిన్నారు. ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు ఎం.ఏ (1980–82), ఎల్‌.ఎల్‌.బీ (1982–85) పూర్తి చేశారు. ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా (1977–85), నగర ఉపాధ్యక్షుడిగా సేవలందించారు.

1986లో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించిన ఆయన, జిల్లా కోర్టులు, నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ సేవలందించారు. 2012లో హైకోర్టు ఆయనను సీనియర్ అడ్వకేట్ గా గుర్తించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో, హైకోర్టులు, ట్రిబ్యూనల్స్‌లలో క్రిమినల్, సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసుల్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రజల పక్షాన అనేక కేసులు వాదించి గెలిచారు. భారత బార్ కౌన్సిల్ సభ్యునిగా కూడా ఎన్నికయ్యారు.

ఇక బీజేపీ నేతలకు న్యాయ సహాయం విషయంలో రామచంద్రరావు ఎప్పుడూ ముందుండే వారు. ప్రజా సమస్యలపై, పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ఉద్యమాలు చేసి జైలు పాలైన బీజేపీ నేతల పక్షాన న్యాయపోరాటం చేసి జైలు నుండి బయటకు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. 1986లో బీజేపీలో చేరి హైదరాబాద్ లోని రవీంద్రనగర్ డివిజన్ నుండి కార్పొరేటర్ గా పోటీ చేశారు. 

బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా (1980–82), నగర ఉపాధ్యక్షుడిగా (1986–90) పనిచేశారు. బీజేపీ రాష్ట్ర లీగల్ సెల్‌లో రామచంద్రరావు క్రియాశీల పాత్ర పోషించారు. లీగల్ సంయుక్త కన్వీనర్ (1999–2003), కన్వీనర్ (2003–06)గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ లీగల్ సెల్ సంయుక్త కన్వీనర్ (2006–10), బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా (2007–09), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా (2009–12), ముఖ్య అధికార ప్రతినిధిగా (2012–15) పనిచేశారు. 

2015లో హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై 2021 వరకు ఫ్లోర్ లీడర్ గా సేవలందించారు. బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడిగా కూడా సేవలందించారు.