సిగాచి కెమికల్స్‌ రియాక్టర్‌ పేలి 13 మంది కార్మికులు మృతి

సిగాచి కెమికల్స్‌ రియాక్టర్‌ పేలి 13 మంది కార్మికులు మృతి
 
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ పేలుడు సంభవించింది. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 13 మంది కార్మికులు మరణించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.  ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 90 మంది ఉన్నారని, 22 మంది కార్మికులు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆయన ప్రమాద స్థలిని పరిశీలించారు.
ఈ ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. “తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాం” అని ప్రకటించారు. 
భవనం శిథిలాలు తొలగిస్తేనే ఎంతమంది బాధితులున్నారో తెలుస్తుందన్నారు.  సోమవారం ఉదయం 6 గంటలకు రియాక్టర్‌ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. పేలుడు ధాటికి రియాక్టర్‌ వద్ద పనిచేస్తున్న కార్మికులు100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ప్రొడక్షన్‌ విభాగం కుప్పకూలింది. మరో భవనానికి బీటలు వారింది. ఉదయం షిఫ్ట్‌కు వచ్చిన కార్మికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.
పేలుడు శబ్ధం వినిపించడంతో కార్మికులు బయటకు పరుగులు తీశారు. మంటల్లో చిక్కుకున్న 50 నుంచి 60 మంది కార్ముకులను బయటకు తీసుకువచ్చారు.  తీవ్రంగా గాయపడిన కార్మికులను ప్రైవేటు దవాఖానకు తరలించారు. మిగితా కార్మికుల విషయం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద స్థలాన్ని సంగారెడ్డి కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పంకజ్ తదితరులు పరిశీలించారు. సహాయక చర్యలో ఫైర్‌, రెవన్యూ, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చందానగర్‌, ఇస్నాపూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11 ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారు. 

కాగా, ప్రమాదంతో రసాయన పరిశ్రమ పరిసరాలకు ఘాటైన వాసనలు వ్యాపించాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలు ఇబ్బుందులు పడుతున్నారు. కంపెనీలో ఒడిశా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కార్మికులు పనిచేస్తున్నారు. విధులకు వెళ్లిన కార్మికులకు వారి కుటుంబ సభ్యులు ఫోన్లు చేస్తున్నారు. అయితే కొందరి ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.

ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆరాతీశారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా ఘటనా స్థలికి వైద్యారోగ్య మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్​ వెంకట స్వామి చేరుకున్నారు. ఘటనాస్థలిని పరిశీలించి ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమల్లో భద్రతపై త్వరలోనే ఒక కమిటీ వేస్తామని, అధిక పని గంటలపై కార్మికులు ఫిర్యాదు చేస్తే లేబర్‌ కమిషన్‌ దర్యాప్తు చేస్తుందని కార్మిక మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.