పూరీ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి

పూరీ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి
ఒడిశాలో పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటుచేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తోపులాటలో ముగ్గురు భక్తులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.  జగన్నాథుడు, అతని తోబుట్టువులు బలధ్రుడు, సుభద్రా దేవితో కూడిన రథాలు ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా ఆలయానికి చేరుకున్నాయి. రథాలను లాగేందుకు, జగన్నాథుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం 4.30 గంటల సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకున్నది. ముగ్గురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో ప్రభాతి దాస్‌, బసంతి సాహూ అనే ఇద్దరు మహిళలు ఉండగా, ప్రేమ్‌కాంత్‌ మొహంతి అనే 70 ఏండ్ల వృద్ధుడు ఉన్నారు. వీరంతా ఒడిశాలోని ఖుద్రా జిల్లాకు చెందినవారని, పూరి రథయాత్రను తిలకించేందుకు వచ్చారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

ఈ ఘటన సమయంలో రథంపై కూర్చున్న జగన్నాథుడిని దర్శనం కోసం జనాలు భారీగా తరలివచ్చారు. దర్శన సమయంలో జన సమూహాన్ని నియంత్రించడం అక్కడి సిబ్బందికి చాలా కష్టంగా మారింది. ఆ క్రమంలో జనాలు ఒకరినొకరు తోసుకుంటూ నేలపై పడిపోయారు. దీంతో తొక్కిసలాట పరిస్థితి తలెత్తింది.

ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పూరీ జగన్నాథ రథయాత్ర ఈ నెల 27న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రథయాత్రలో అధిక వేడి, రద్దీ కారణంగా తొలిరోజే పలువురు భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 600 మందికిపైగా భక్తులు అస్వస్థతో ఆసుపత్రిలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం పలువురు డిశ్చార్జ్‌ అయినట్లు చెప్పారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.

ఒడిశా పోలీసులు, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కు చెందిన దాదాపు 10,000 మంది సిబ్బందిని వార్షిక రథయాత్ర భద్రత కోసం ఏర్పాటు చేశారు. జన సమూహాన్ని పర్యవేక్షించడానికి 275కి పైగా సిసిటివి కెమెరాలను ఏర్పాటు చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఖురానియా తెలిపారు. గుండిచా ఆలయం 12వ శతాబ్దపు జగన్నాథ ఆలయం నుంచి 2.6 కి.మీ దూరంలో ఉంది. ఈ సంవత్సరం జూలై 5న జరిగే తిరుగు ప్రయాణ రథయాత్రను బహుద యాత్ర అని పిలుస్తారు.