
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా గట్టి గుణపాఠం చెప్పిన విషయం తెలిసిందే. పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ చేపట్టిన భీకర దాడుల్లో ఉగ్ర స్థావరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే, భారత్ చేతిలో చావుదెబ్బ తిన్నప్పటికీ పాక్ తీరులో మాత్రం మార్పు రావడం లేదు. ఆపరేషన్ సిందూర్ లో దెబ్బతిన్న టెర్రరిస్ట్ లాంచ్‌ప్యాడ్స్‌ను పాక్ మళ్లీ తిరిగి పునర్నిర్మిస్తోంది.
భారత్ జరిపిన ఖచ్చితమైన సైనిక దాడుల సమయంలో ధ్వంసమైన ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌లు, శిక్షణా శిబిరాలను పాకిస్థాన్ పునర్నిర్మించడం ప్రారంభించిందని సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. పాకిస్థాన్ సైన్యం, ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ కలిసి ఉగ్రవాద ట్రైనింగ్ క్యాంపులను, పీఓకేలో ఉగ్రవాదుల కోసం మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నట్టు సమాచారం.
నియంత్రణ రేఖ వెంబడి ఉన్న దట్టమైన అడవుల్లో భారత రాడార్, ఉపగ్రహాలు గుర్తించలేని విధంగా హైటెక్ మినీ ఉగ్ర శిబిరాలను పాక్ నిర్మిస్తున్నట్లు నిఘా సంస్థలు సూచిస్తున్నాయి. లుని, పుట్వాల్, తైపు పోస్ట్, జమిలా పోస్ట్, ఉమ్రాన్వాలి, చాప్రార్, ఫార్వర్డ్ కహుటా, చోటా చక్, జంగ్లోరా వంటి ప్రాంతాల్లో శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు తెలిసింది.
కొత్తగా నిర్మిస్తున్న ఈ శిబిరాల్లో థర్మల్ ఇమేజర్లు, ఫోలేజ్-పెనెట్రేటింగ్ రాడార్, ఉపగ్రహ నిఘాను ఎదుర్కోవడానికి రూపొందించిన అధునాతన సాంకేతికతలు అమర్చినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ సైన్యం, ఐఎస్‌ఎస్ కూడా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 13 లాంచ్ ప్యాడ్‌లను తిరిగి అభివృద్ధి చేస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లీపా వ్యాలీ, పచిబన్ చమన్, తాండ్‌పాని, నయాలి, జన్కోట్, చకోటి, నికైల్, ఫార్వర్డ్ కహుటా వంటి ప్రాంతాల్లో వీటిని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది.
వీటితోపాటు జమ్ము సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న నాలుగు లాంచ్‌ప్యాడ్‌లను ఐఎస్‌ఐ తిరిగి అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. వీటిలో మస్రూర్ బడా భాయ్, చాప్రార్, లూని, షకర్‌గఢ్‌లోని డ్రోన్ సెంటర్లు ఉన్నాయి. భారత్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పాక్ ఒకే ప్రదేశంలో ఉగ్రవాదులు ఉండకుండా పెద్ద శిబిరాలను చిన్నవిగా విభజించినట్లు తెలుస్తోంది.
ఇలా చేయడం వల్ల ఏదైనా దాడి జరిగినా నష్టాన్ని నివారించొచ్చని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి మినీ క్యాంప్‌కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకంగా శిక్షణ పొందిన పాక్ ఆర్మీ సిబ్బంది వీటిని పర్యవేక్షించనున్నట్లు సమాచారం.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?