అగ్రరాజ్యాల మధ్య మరోసారి `కోల్డ్ వార్’కు నాటో ఆజ్యం 

అగ్రరాజ్యాల మధ్య మరోసారి `కోల్డ్ వార్’కు నాటో ఆజ్యం 

ఇటీవలే (జూన్ 24, 25) నెదర్లాండ్స్‌లో జరిగిన నాటో కూటమి సదస్సులో తీసుకున్న సంచలన నిర్ణయాలను చూస్తుంటే అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, వ్లాదిమిర్ పుతిన్ సారథ్యంలోని రష్యాల మధ్య మరోసారి `ప్రచ్ఛన్న యుద్ధం’కు సంకేతాలే కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ విషయంలో రాజీలేకుండా రష్యా ముందుకు సాగుతుండటాన్ని చూసి ఆందోళన చెందుతున్న నాటో దేశాలు, ఇక నుంచి తమ జీడీపీలో 5 శాతాన్ని రక్షణ వ్యయాలకు కేటాయిస్తామని ప్రకటించాయి. 

రష్యాను ఎదుర్కొనేందుకు సైనిక శక్తి నుంచి సైబర్ శక్తి దాకా అన్నీ బలోపేతం చేస్తామని నాటో తీర్మానించింది  రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకీలపై అణుబాంబులు వేసింది. దీని తర్వాత అంతర్జాతీయ స్థాయి కలిగిన సామాజిక, ఆర్థిక సంస్థలు అమెరికా కనుసన్నల్లో పనిచేయసాగాయి. కొన్ని దేశాలను ఆర్థిక సాయంతో, ఇంకొన్ని దేశాలను సైనిక సాయంతో, మరికొన్ని దేశాలను అంతర్జాతీయ సంస్థల ద్వారా తన పక్షాన ఉండేలా అమెరికా మార్చుకుంది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సోవియట్ యూనియన్ (అవిభక్త రష్యా) అనేది అమెరికాకు పెద్ద సవాల్‌గా కనిపించింది. దాన్ని ఎదుర్కొనేందుకు పశ్చిమ ఐరోపా దేశాలను చేరదీసి, వాటికి అమెరికా పెద్దఎత్తున సైనిక సాయాన్ని అందించింది. ఈ పరిణామాలను గుర్తించి అప్రమత్తమైన సోవియట్ యూనియన్ తన మిత్ర దేశాల సంఖ్యను పెంచుకోసాగింది. నాటోకు వ్యతిరేకంగా తన మిత్ర దేశాలకు సైనిక సాయాన్ని పెంచింది. 

ఈ ప్రచ్ఛన్న యుద్ధ పరిస్థితుల్లో 1949 నుంచి 1985 మధ్యకాలంలో నాటో కూటమి దేశాల రక్షణ వ్యయాలు భారీగా పెరిగాయి. 1949లో కేవలం 13.5 బిలియన్ డాలర్లుగా ఉన్న అమెరికా రక్షణ బడ్జెట్, 1985 కల్లా 266.6 బిలియన్ డాలర్లకు చేరింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగిన తర్వాత పరిస్థితి మారిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపా గడ్డపై జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఇదే. 
 
అందుకే నాటో కూటమి దేశాలు ఇంతలా ఆందోళన చెందుతున్నాయి. ఉక్రెయిన్ ఇరుగు పొరుగున చాలా వరకు నాటో దేశాలే ఉన్నాయి. దాదాపు గత మూడేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్ తలపడుతోంది అంటే అందుకు కారణం నాటో కూటమే. 2024లో రష్యా రక్షణ బడ్జెట్ 38 శాతం పెరిగి 149 బిలియన్ డాలర్లకు చేరింది. రష్యాతో యుద్ధంలో కుదేలైన ఉక్రెయిన్ వద్ద ప్రస్తుతం నిధులు లేవు.
 
నాటో దేశాలు, అమెరికా అందిస్తున్న నిధులతోనే ఇంతటి రేంజులో ఉక్రెయిన్ రక్షణ వ్యయం చేస్తోంది. రష్యా పొరుగునే ఉన్న మరో నాటో దేశం పోలాండ్ సైతం 2024లో జీడీపీలో 4.2 శాతాన్ని(38 బిలియన్ డాలర్లు) రక్షణ వ్యయాలకు కేటాయించింది. ఉక్రెయిన్‌లో తాము ఆక్రమించుకున్న ప్రాంతాలను వదిలేందుకు పుతిన్ ససేమిరా అంటున్నారు.