రోదసిలో శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ

రోదసిలో శుభాన్షు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు చేరుకున్న తొలి భారతీయుడు శుభాన్షు శుక్లాతో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మాట్లాడారు.  ఐఎస్‌ఎస్‌కు చేరుకోవడం గర్వంగా ఉందని శుక్లా అన్నారు. అలాగే తాను సురక్షితంగా ఉన్నట్లు మోదీకి తెలిపారు. శుభాంశు శుక్లాతో ప్రధాని సంభాషణ జరుపుతుండగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో భారత్ మాతా కీ జై నినాదం మోగింది.

మాతృభూమికి ఆయన దూరంగా ఉన్నప్పటికీ భారతీయుల హృదయాలకు అత్యంత దగ్గరగా ఉన్నారని ప్రధాని కొనియాడారు. ‘మీ పేరులోనే శుభం ఉంది. కొత్త యుగానికి మీ యాత్ర శుభారంభంగా నిలుస్తుంది’ అని అని పేర్కొన్నారు.

మీరు మాతృభూమి నుంచి దూరంగా ఉండొచ్చు. కానీ భారతీయుల హృదయాలకు దగ్గరగా ఉన్నారు. మీ పేరులోనే శుభం ఉంది. మీ యాత్ర కొత్తయుగానికి శుభారంభం. ఈ సమయంలో మేమిద్దరం మాత్రమే మాట్లాడుకుంటున్నాం. కానీ 140 కోట్ల మంది భారతీయుల భావాలు కూడా నాతో ఉన్నాయి. నా గొంతులో భారతీయుల ఉత్సాహం ఉంది” అని ప్రధాని చెప్పారు. 

“అంతరిక్షంలో భారతీయ జెండాను ఎగురవేసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా ఇది చెప్పండి. అక్కడ అంతా బాగా ఉందా? మీ ఆరోగ్యం బాగుందా?” అని అడిగారు. 

“ప్రధానమంత్రి జీ, 140 కోట్ల మంది భారతీయులకు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీ అందరీ ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇక్కడ క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. ఇక్కడ చాలా బాగుంది. ఇది ఒక కొత్త అనుభవం. ఈ యాత్ర నాది మాత్రమే కాదు. ఇది దేశం మెుత్తం ప్రయాణం. మీ నాయకత్వంలో నేటి భారత్‌ కలలను సాకారం చేసుకోవటానికి అనేక అవకాశాలు కల్పిస్తోంది. ఇది నాకు పెద్ద అవకాశం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు చాలా గర్వంగా ఉంది” అని శుక్లా చెప్పారు.

రోదసిలో మీరు ఏన్నో పరిశోధనలు చేస్తున్నారు? రాబోయే రోజుల్లో వ్యవసాయం, ఆరోగ్యానికి మేలు చేసే ప్రయోగం ఏదైనా ఉందా?” అని ప్రధాని అడిగారు. “గర్వంగా చెప్పగలను. మొదటిసారి భారతీయ శాస్త్రవేత్తలు ఏడు వినూత్న పరిశోధనలకు రూపకల్పన చేశారు. వాటిని ఐఎస్‌ఎస్‌కు తీసుకొచ్చాను. మెుదటి పరిశోధనను మూల కణాలపై చేపట్టాల్సి ఉంది. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు. తద్వారా కండరాల క్షీణత చోటు చేసుకుంటుంది” అని శుక్లా సమాధానం ఇచ్చారు. 

“ప్రత్యేక పదార్థం తీసుకోవడం ద్వారా కండరాల క్షీణతను నిలువరించటం లేదా వాయిదా వేయటంపై నా పరిశోధన కేంద్రీకృతం అవుతుంది. కండరాల క్షీణతతో భూమిపైనా బాధపడే వృద్ధులకు ఈ ప్రత్యేక పదార్థం ఉపయోగపడుతుందేమో పరీక్షిస్తాం. రెండోది మైక్రో స్థాయిలోని గ్రోత్‌ ప్రయోగం. మైక్రో లెవల్స్‌ చాలా చిన్నగా ఉంటాయి. కానీ అవి చాలా పోషకాలతో కూడినవి. ఇక్కడ వాటి వృద్ధిని చూస్తే ఆ ప్రక్రియను అనుసరిస్తే పెద్దమొత్తంలో అభివృద్ధి చేసి పోషకాలు అందించవచ్చు. ఇది ఆహార భద్రతకు కూడా ఉపకరిస్తుంది” అని వివరించారు.

శుభాంశు అంతరిక్షానికి వెళ్లిన మీరు మెుట్టమెుదటి భారతీయుడు. మీరు చాలా కష్టపడ్డారు. ఎక్కువ శిక్షణ తీసుకొని వెళ్లారు. మీరు ఇప్పుడు నిజంగా అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి పరిస్థితులు ఎంత భిన్నంగా ఉన్నాయి. వాటిని ఎలా స్వీకరించారు?” అని ప్రధాని ప్రశ్నించారు.

ప్రధాన మంత్రి జీ ఇక్కడ అన్నీ భిన్నంగా ఉన్నాయి. ఏడాది శిక్షణ తీసుకున్నాను. మెుత్తం వ్యవస్థల గురించి తెలుసు. మెుత్తం ప్రక్రియ గురించి తెలుసు. ప్రయోగాల గురించి తెలుసు. కానీ ఇక్కడి రాగానే ఆకస్మాత్తుగా మెుత్తం మారిపోయింది. ఎందుకంటే మన శరీరం గ్రావిటీకి అలవాటుపడింది. ఇక్కడ మైక్రో గ్రావిటీ ఉంది. చిన్నచిన్న పనులు కూడా చాలా కష్టమవుతుంది” అని శుక్లా చెప్పారు. 

“ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా కాళ్లను కట్టుకున్నాను. లేదంటే నేను పైకి వెళ్లిపోతాను. నీళ్లు తాగాలన్నా, నడవాలన్నా, అన్నింటి కంటే పడుకోవడం చాలా కష్టం. మీరు గోడ మీద, భూమీ మీద పడుకుంటాం. శిక్షణ బాగుంది. కానీ మారిన వాతావరణానికి అలవాటు పడడానికి ఒకటి రెండు రోజులు పడుతుంది” అని తెలిపారు. సైన్స్‌, ఆధ్యాత్మికం రెండు భారత్‌ సామార్థ్యాలు. మీ అంతరిక్ష పయనంతోపాటు భారత్‌ యాత్ర కూడా కొనసాగుతోంది. స్పేస్‌ సెంటర్‌లో మనశ్శాంతి కోసం ధ్యానం ఏమైనా ఉపయోగ పడుతుందా?” అని ప్రధాని వాకబు చేశారు.

కచ్చితంగా ఉపయోగపడుతోంది. భారత్‌ ఇప్పటికే యోగా కార్యాక్రమాలు చాలా చేస్తోంది. ఈ మిషన్‌ పెద్ద పజిల్‌ లాంటిది. నేను అంతరిక్ష యాత్రకు వచ్చే ముందు అంతరిక్షంలో మనశ్శాంతి ఉండదని చాలా మంది అన్నారు. చాలా పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. సాధారణ శిక్షణ తీసుకునేప్పుడు, రాకెట్‌ లాంచ్‌ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యాను” అని శుక్లా సమాధానమిచ్చారు. 

“మనశ్శాంతి ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా శాంతగా ఉండవచ్చు. పని చేసే సమయంలోనూ సరైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో ధ్యానం చేస్తే చాలా ఉపయోగపడుతుంది. పరిస్థితులతో త్వరగా మమైకమవడానికి సహయపడుతుంది” అని చెప్పారు.

చంద్రయాన్‌ విజయవంతం తర్వాత దేశంలోని పిల్లల్లో, యువకుల్లో విజ్ఞానంపై ఆసక్తి పెరిగింది. అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెరిగింది. మీ చారిత్రక యాత్ర ఆ సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తోంది. నేడు పిల్లలు కేవలం ఆకాశాన్ని మాత్రమే చూడటం లేదు. నేను కూడా అక్కడికి వెళ్లగలనని అనుకుంటున్నారు. ఈ ఆలోచన, ఈ భావన మన భవిష్యత్‌ అంతరిక్ష మిషన్లకు పునాది. మీరు యువతకు ఏం సందేశం ఇస్తారు?” అని ప్రధాని ప్రశ్నించారు.

దేశ యువతకు ఏం సందేశం ఇస్తానంటే దేశం సాగుతున్న దిశను చూస్తుంటే గొప్ప కలలు కంటున్నాం. ఆ కలలను సాకారం చేసుకునేందుకు మీ సహకారం కావాలి. అది పూర్తి కావటానికి ఏమంటానంటే మీ ప్రయత్నం మానుకోవద్దు. ఈ మూలమంత్రాన్ని గుర్తించుకుంటే ఏ దారిలో వెళ్లినా దాని వదలకుంటే విజయం తప్పక వరిస్తుంది” అని తెలిపారు.

అంతరిక్షంలోకి వెళ్లాక మీకు కలిగిన మెుదటి ఆలోచన ఏంటి? అని ప్రధాని అడిగితే  అంతరిక్షంలో వెళ్లిన తర్వాత మొదట భూమిని చూశాం. అంతరిక్షం నుంచి పుడమిని చూడగానే భూమి అంతా ఒక్కటే అనిపించిందని, బయటి నుంచి సరిహద్దులు ఏవీ కనపడలేదని, అంతరిక్షం నుంచి భారత్‌ను మెుదటిసారి చూసినప్పుడు కొన్ని అంశాలను గమనించానని శుక్లా చెప్పారు. 

“పటంలో భారత్‌ను చూస్తాం. మిగతా దేశాల విస్తీర్ణం ఎంత? మన దేశ విస్తీర్ణం ఎంత అని పటంలో చూస్తాం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే త్రీడీ వస్తువును మనం టూడీలో చూస్తాం. రోదసి భారత్ భవ్యంగా కనిపిస్తుంది. పటంలో చూసిన దానికంటే పెద్దగా కనిపించింది. భూమిని బయట నుంచి చూసినప్పుడు సరిహద్దులు, దేశాలు, రాజ్యాలు ఏవి కనిపించవు. మనమంతా మనుషులం. భూమి ఒక్కటే. అందులో మనమంతా పౌరులం” అని వివరించారు.