
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ శతాబ్ది ఉత్సవాలువేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ‘ ధర్మ చక్రవర్తి ‘ అనే బిరుదును ఇచ్చారు. ధర్మాన్ని కాపాడే పాలకుడికి గుర్తుగా ఈ బిరుదును మోదీకి అందించారు. ఈ ఉత్సవాలు ఏడాది పొడవునా జరగనున్నాయి. ఆచార్య విద్యానంద్ జీ సేవలను గుర్తు చేసుకుంటూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భగవాన్ మహావీర్ అహింసా భారత్ ట్రస్ట్ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.
తనకు ధర్మ చక్రవర్తి బిరుదును ప్రదానం చేయడం పట్ల ప్రధాని మోదీ స్పందిస్తూ “ఈ సందర్భంగా మీరు నాకు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదును ప్రదానం చేశారు. నేను ఈ బిరుదుకు తగినవాడిని అని భావించడం లేదు. అయితే సాధువులు ఏది ఇచ్చినా దాన్ని ప్రసాదంగా స్వీకరించాలనేది మన సంస్కృతి. అందుకే ఈ ప్రసాదాన్ని వినయంగా స్వీకరిస్తున్నాను. ఈ ధర్మ చక్రవర్తి బిరుదును దేశానికి అంకితం చేస్తున్నాను” అని తెలిపారు.
ఆచార్య విద్యానంద్ జీ 1987 జూన్ 28న ఆచార్య బిరుదును పొందారని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఇది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదని, జైన సంస్కృతిని, ఆలోచనలను, కరుణను అనుసంధానించే ఒక పవిత్రమైన మార్గమని తెలిపారు. క్రమశిక్షణతో కూడిన సన్యాసి జీవితాన్ని గుర్తు చేసే వేడుక ఇది అని పేర్కొన్నారు. ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ జీవితం, ఆయన సేవలను తెలియజేసే ఒక ప్రత్యేక ప్రదర్శనను ప్రధాని మోదీ సందర్శించారు.
ఈ ప్రదర్శనలో విద్యానంద్ జీవితానికి సంబంధించిన అనేక చిత్రాలు, పెయింటింగ్‌లు, ఇతర ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆచార్య శ్రీ విద్యానంద్ జీ మహారాజ్‌ను ప్రధాని మోదీ ఒక యుగ పురుష్, యుగ ద్రష్టగా అభివర్ణించారు. ఆచార్య విద్యానంద్ జీ ఆధ్యాత్మిక ప్రభావాన్ని తాను వ్యక్తిగతంగా అనుభవించానని, ఆయన తనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేశారని మోదీ చెప్పారు.
ఈ సందర్భంగా ఆచార్య శ్రీ 108 విద్యానంద్ జీ మహరాజ్ స్మారక పోస్టల్ స్టాంపును, నాణేన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ విడుదల చేశారు. ఆయన జీవిత చరిత్రను తెలిపే ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు. ఆచార్య విద్యానంద్ జీ 1925లో కర్ణాటకలోని బెళగావిలో జన్మించారు. ఆయన ఆధునిక భారతదేశంలో గొప్ప జైన సన్యాసిగా పేరు గాంచారు.
ఆయన 8 వేల కంటే ఎక్కువ జైన శ్లోకాలను కంఠస్థం చేశారు. జైన దర్శన్, అనేకత్వవాద్, మోక్షమార్గ దర్శన్ వంటి 50కి పైగా పుస్తకాలను రచించారు. ఆయన ఒక కఠినమైన సన్యాసి జీవితాన్ని గడిపారు. దేశమంతా చెప్పులు లేకుండా తిరిగారు. ఆధ్యాత్మిక సమానత్వాన్ని, మతాల మధ్య సామరస్యాన్ని ప్రోత్సహించారు.
ఆయన చేసిన ముఖ్యమైన పనుల్లో 1975లో భగవాన్ మహావీర్ 2500వ నిర్వాణ మహోత్సవం సందర్భంగా అధికారిక జైన జెండాను, చిహ్నాన్ని రూపొందించడం ఒకటి. ఐదు రంగుల జెండా, అహింసా చేతి గుర్తు ఇప్పుడు జైన సంప్రదాయాలలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. బీహార్‌లోని బాసోకుండ్ను భగవాన్ మహావీర్ జన్మస్థలంగా గుర్తించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం 1956లో గుర్తించింది. ఈ శతాబ్ది ఉత్సవాలు వచ్చే ఏడాది ఏప్రిల్ 22వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జరుగుతాయి. ,
More Stories
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం
రాహుల్ గాంధీ మలేసియా `విహార యాత్ర’పై దుమారం