* కలెక్టర్, ఎస్పీ బదిలీ.. దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ
పూరీ జగన్నాథ రథయాత్రలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జగన్నాథ్ భక్తులందరికీ ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు మాఝి ప్రకటించారు. ఈ భద్రతా నిర్లక్ష్యం క్షమించరానిదన్న ముఖ్యమంత్రి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంచ ప్రఖ్యాతిగాంచిన పూరీ జగన్నాథ రథయాత్రను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో దురదృష్టవశాత్తు తొక్కిసలాట జరిగిందని సీఎం వెల్లడించారు.
పూరీ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వైన్, ఎస్పీ వినీత్ అగర్వాల్‌లపై బదిలీ వేటు వేసింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు డీసీపీ విష్ణు పాటి, కమాండెంట్ అజయ్ పాధిలను సస్పెండ్ చేశారు. పూరి జిల్లా కొత్త కలెక్టర్‌గా చంచల్ రాణాను, కొత్త ఎస్పీగా పినాక్ మిశ్రాను ప్రభుత్వం నియమించింది. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డెవలప్‌మెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఘటనపై విచారణకు సీఎం మాఝీ ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. పూరీ కలెక్టర్ సిద్ధార్థ్, ఎస్పీ బినిత్ అగర్వాల్ను బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. వీరితో పాటు పూరీ డీసీపీ బిష్ణు చరణ్ పాటి, పోలీస్ కమాండెంట్ అజయ్ పధిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ తొక్కిసలాట ఘటనపై పూరీ రాజు గజపతి మహారాజ దివ్యసింగ్దేబ్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఒడిశా ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా సరైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పూరీ జగన్నాథ్ రథయాత్రకు మరిన్ని ఏర్పాట్లు చేసి ఉండాల్సిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు ఈసారి రథయాత్ర ప్రారంభించడంలో ఆలస్యం జరగడంపై రాజకీయ వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిని భయంకరమైన గందరగోళంగా అభివర్ణించారు. సరై. న సమయానికే రథాలు గుండీచా ఆలయానికి చేరుకున్నాయని బీజేపీ చెబుతోంది. 1977 నుంచి రథాలు ఎల్లప్పుడూ రెండో రోజునే గుండిచా ఆలయానికి చేరుకుంటాయని ఒడిశా న్యాయశాఖ మంత్రి హరిచందన్ పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని వివరించారు.
ఈ తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో సహాయక చర్యలో పాల్గొనాలంటూ ఒడిశా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఒడిశా ప్రభుత్వానికి రాహుల్ గాంధీ సూచించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు