నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారం లాంచనంగా ప్రారంభించారు. అలాగే పసుపు బోర్డు కార్యా లయంలో ఏర్పాటు చేసిన పసు పు ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలోప్రసంగిస్తూ నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
తెలంగాణ రైతుల అభ్యున్నతికి, పసుపు రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.నిజామాబాదు పసుపుకు ప్రపంచ మార్కెట్లో గొప్ప పేరుందని చెబుతూ దాని ప్రాధాన్యతను మరింత పెంచాల్సి ఉందని తెలిపారు. పసుపు కేవలం ఒక పంట కాదని, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న ఒక దివ్య ఔషధమని ఆయన కొనియాడారు.
“2030 సంవత్సరం నాటికి ఒక బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8,300 కోట్లు) విలువైన పసుపు ఉత్పత్తులను భారతదేశం నుంచి ఎగుమతి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని ఆయన స్పష్టం చేశారు. ఈ బోర్డు ద్వారా రైతులకు ఆధునిక సాగు పద్ధతులపై శిక్షణ అందిస్తామని, తద్వారా దిగుబడి, నాణ్యత పెంచేందుకు తోడ్పడతామని అమిత్ షా వివరించారు.
నిజామాబాద్ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందని, పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని ఆయన చెప్పారు. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటవుతున్నాయని వివరించారు. భారత్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌తో నిజామాబాద్ పసుపు అమెరికా, యూరప్‌కు ఎగుమతి అవుతుందని అమిత్ షా వెల్లడించారు.
కాగా, తెలంగాణలో బీజేపీ తప్పక అధికారంలోకి వస్తుందని అమిత్ షా దీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైందని తెలుస్తోందని వివరించారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌కు పసుపుబోర్డు సాధించారని చెప్పారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారని ఆయన పేర్కొన్నారు.
మావోయిస్టులు (నక్సలైట్లు) తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసిందని ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో ఆదేశానికి, ప్రపంచానికి తెలిసింది అని అమిత్‌షా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాకుండా దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు.
నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా? మీరే చెప్పండని అక్కడ ఉన్న సభికుల్ని ఉద్దేశించి అమిత్‌షా అడిగారు. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కోరారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని అమిత్‌షా పిలుపునిచ్చారు. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని, వారంతా జన జీవన స్రవంతిలోకి వచ్చేసినట్లు గుర్తుచేశారు.
అలానే కంఠేశ్వర్ కూడలిలో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి డి. శ్రీనివాస్ విగ్రహాని ఆయన అవిష్కరించనున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, పసుపు బోర్డు కార్యదర్శి భవానీ శ్రీ , ఎంపీలు ధర్మపురి అర్వింద్, డా. లక్ష్మణ్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు పాల్గొన్నారు.

More Stories
బిహార్ ఎన్నికల్లో వికాసానికి, వినాశనానికి మధ్య పోరు
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?