
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశాన్ని ఐక్యంగా ఉంచడానికి ఒకే రాజ్యాంగాన్ని ఊహించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ తెలిపారు. ఒక రాష్ట్రానికి ప్రత్యేక రాజ్యాంగం అనే ఆలోచనను ఎప్పుడూ ఇష్టపడలేదని పేర్కొంటూ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయాలనే కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. ఒకే రాజ్యాంగం కింద ఐక్య భారత్ అనే డాక్టర్ అంబేద్కర్ దార్శనికత నుంచి సుప్రీంకోర్టు ప్రేరణ పొందిందని తెలిపారు.
మహారాష్ట్రలోని నాగపూర్ లో రాజ్యాంగ ప్రవేశిక పార్క్ ప్రారంభోత్సవంలో పాల్గొంటూ “ఆర్టికల్ 370ని సవాలు చేసినప్పుడు అది మా ముందుకు వచ్చింది. విచారణ జరుగుతున్నప్పుడు “ఒక దేశానికి ఒకే రాజ్యాంగం సరిపోతుంది. మనం దేశాన్ని ఐక్యంగా ఉంచాలనుకుంటే మనకు ఒకే రాజ్యాంగం అవసరం” అని డాక్టర్ అంబేద్కర్ చెప్పిన మాటలను నేను గుర్తుచేసుకున్నాను” అని ఆయన తెలిపారు.
రాజ్యాంగం సమాఖ్యవాదాన్ని అందిస్తుందని, యుద్ధ సమయాల్లో దేశం ఐక్యంగా ఉండకపోవచ్చని డాక్టర్ అంబేద్కర్ను విమర్శించారని జస్టిస్ గవాయ్ గుర్తుచేశారు. అయితే రాజ్యాంగం అన్ని సవాళ్లకు అనుగుణంగా ఉంటుందని, దేశాన్ని ఐక్యంగా ఉంచుతుందని ఆయన ప్రతిస్పందించారని సీజేఐ పేర్కొన్నారు. పొరుగు దేశాల్లో పరిస్థితిని చూడండని, కానీ మన దేశం సవాళ్లను ఎదుర్కొన్నప్పుడల్లా అది ఐక్యంగానే ఉందని తెలిపారు.
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ జస్టిస్ గవాయ్ రాజ్యాంగ ప్రవేశిక ఉద్యానవనాన్ని ప్రారంభించి, డాక్టర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు సంతోషంగా ఉందని చెప్పారు. రాజ్యాంగం రూపంలో డాక్టర్ అంబేద్కర్ దేశానికి ఇచ్చిన విలువైన బహుమతి స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలు కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ, శాసనసభ, మీడియా అని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కొనియాడారు. రాజ్యాంగ అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని రాజ్యాంగం ప్రవేశిక ప్రతి విద్యార్థికి చేరుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ప్రవేశిక విలువలను అంగీకరిస్తే, దేశంలోని 90 శాతం సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని చెప్పారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్