బీహార్ లో మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటింగ్‌

బీహార్ లో మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటింగ్‌
మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ప్రజలు తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ విధానానికి అనుమతి ఇచ్చిన తొలి రాష్ట్రంగా బీహార్ నిలిచింది. ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ ఈ విషయాన్ని శుక్రవారం తెలిపారు. మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్‌ కౌన్సిల్‌ పదవులకు శనివారం పోలింగ్ జరుగనున్నది. పోలింగ్‌ బూత్‌కు వెళ్లలేని వారికి ఈ కొత్త ఓటింగ్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుందని దీపక్‌ ప్రసాద్ చెప్పారు. 
 
ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన యాప్ ద్వారా ఓటు వేయవచ్చని తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, గర్భిణీలు, వలస ఓటర్లు, శారీరక లేదా ఇతర కారణాల వల్ల పోలింగ్ కేంద్రానికి చేరుకోలేని వారు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని ఓటు వేయవచ్చని వివరించారు. మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటింగ్‌ గురించి జూన్ 10 నుంచి 22 వరకు అవగాహన ప్రచారం నిర్వహించినట్లు వెల్లడించారు.

కాగా, ఈ-ఓటింగ్ కోసం నమోదు చేసుకోవాలనుకునే ఓటర్లు తమ మొబైల్‌లో e-SECBHR యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు. ఈ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్‌లకు మాత్రమే అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేరు నమోదు చేసుకున్న ఫోన్ నంబర్‌కు ఈ యాప్‌ను లింక్ చేయాలని అన్నారు.

మరోవైపు ఇప్పటికే 10,000 మంది ఓటర్లు యాప్‌లో సైన్ అప్ చేసుకున్నారని దీపక్ ప్రసాద్ తెలిపారు. సుమారు 50,000 మంది పోలింగ్ బూత్‌లకు వెళ్లకుండా వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. బ్లాక్‌చెయిన్ ప్లాట్‌ఫామ్, ఫేస్ మ్యాచ్, స్కానింగ్ వంటి వ్యవస్థలతో కూడిన మొబైల్ యాప్ ద్వారా ఓటింగ్‌ విధానం ట్యాంపర్ ప్రూఫ్‌గా పని చేస్తుందని వివరించారు. అయితే త్వరలో జరుగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో మొబైల్ ఫోన్ యాప్ ద్వారా ఓటింగ్‌కు అనుమతి ఇస్తారో లేదో అన్నది ఆయన స్పష్టం చేయలేదు.