
ఉత్తరప్రదేశ్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడింది. వారిలో ముగ్గురు అధికార ఎన్‌డిఎ ఎమ్మెల్యేలే. ఈ నెల ప్రారంభంలో బిజెపి మిత్రపక్షమైన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బిఎస్‌పి) ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారీపై అనర్హత వేటు వేశారు. మూడేళ్ల క్రితం నాటి విద్వేష ప్రసంగం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడినందుకు అబ్బాస్ అన్సారీ అనర్హత వేటుకు గురయ్యారు.
అన్సారీపై వేటుతో ప్రసుత్త ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మొత్తంగా ఆరుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. వీరిలో ఎన్‌డిఎ, ఎస్‌పిలకు చెందిన చెరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీకి 2022 ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరిగాయి. 403 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడటం గమనార్హం.
గత అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు అనర్హత వేటుకు గురయ్యారు. వారిలో బిజెపికి చెందిన ముగ్గురు, ఎస్‌పికి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.ప్రస్తుత అసెంబ్లీలో అనర్హత వేటు పడిన వారి వివరాలిలా ఉన్నాయి.
విక్రం సైనీ (బిజెపి) : ఖతౌలి నియోజవర్గం నుంచి ఎన్నికైన విక్రం సైనీపై 2022 నవంబర్‌లో అనర్హత వేటు పడింది. 2013 ముజఫర్ నగర్ అల్లర్లకు సంబంధించిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన ఒక నెల తరువాత సైనీపై ఈ నిర్ణయం తీసుకున్నారు. అజాం ఖాన్‌పై తక్షణమే అనర్హత వేటు వేసినప్పుడు సైనీ ఎందుకు నిర్ణయం తీసుకోరని విమర్శలు రావడంతో స్పీకర్ సతీష్ మహానా సైనీపై వేటు వేశారు. 2022 డిసెంబరులో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో సైనీ భార్య రాజకుమారిపై సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఆర్‌ఎల్‌డి అభ్యర్థి మదన్ భైయ్య విజయం సాధించారు.
అబ్బాస్ అన్సారీ (ఎస్‌బిఎస్‌పి) : మౌ సదర్ నుంచి విజయం సాధించిన అబ్సాస్‌పై ఈ నెలలోనే అనర్హత వేటు పడింది. 2022 అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా విద్వేష ప్రసంగం చేసారనే కేసులో శిక్ష పడినందుకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఉప ఎన్నికలు గురించి ఎలక్షన్ కమిషన్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
రామ్‌దులార్ గోండ్ (బిజెపి) : దుద్హి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన రాందులార్ గోండ్‌పై 2023 డిసెంబరులో అనర్హత వేటు పడింది. 15 ఏళ్ల బాలికపై 2014లో అత్యాచారం చేసిన కేసులో సోన్‌భద్ర జిల్లా కోర్టు ఏకంగా 25 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకోకతప్పలేదు. బాధిత కుటుంబాన్ని బెదిరించినట్లు కూడా రామ్‌దులార్‌పై అభియోగాలు నమోదయ్యాయి. 2024 జూన్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిపై ఎస్‌పికి చెందిన విజరు కుమార్ సింగ్ విజయం సాధించారు.
అజాం ఖాన్ (ఎస్‌పి) : రామ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి ఎంపికైన అజాం ఖాన్ గతంలో ఎస్‌పి ప్రభుత్వంలో మంత్రిగానూ పనిచేశారు. యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇతనిపై 87 కేసులు నమోదయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికలు జరిగిన కొద్ది నెలలకే అంటే 2022 అక్టోబర్‌లోనే అజాం ఖాన్‌పై అనర్హత వేటు పడింది. 2019 నాటి విద్వేష ప్రసంగం కేసులో శిక్ష పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అబ్దుల్లా అజాం ఖాన్ (ఎస్‌పి) : సౌర్ నియోజకవర్గం నుంచి గెలిచిన అజాం ఖాన్ కుమారుడు అబ్దుల్లాపై 2023 ఫిబ్రవరిలో అనర్హత వేటు పడింది. 15 ఏళ్ల కిత్రం నాటి పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడినందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇర్ఫాన్ సోలంకీ (ఎస్‌పి) : సిషామౌ నుంచి విజయం సాధించిన ఇర్ఫాన్‌పై గతేడాది జూన్‌లో అనర్హత వేటుపడింది. 2022లో ఒక మహిళపై వేధింపులకు పాడిన కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడ్డంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సోలంకిపై యోగి ప్రభుత్వం ఏకంగా ఎనిమిదికి పైగా కేసులు నమోదు చేసింది. గతేడాది నవంబర్‌లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిపై సోలంకి భార్య నసీమ్ విజయం సాధించారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు