
ఔషధాలపై రోగులలో మరింత విశ్వాసాన్ని పెంచేందుకు ఔషధాల ప్యాకేజింగ్‌కు సంబంధించి భారీ ప్రక్షాళన చేపట్టనున్నది. ఇందులో భాగంగా ఇక ఔషధాల లేబుళ్లపై ఉండే క్యూఆర్ కోడ్‌లు మాటల రూపంలో కూడా వినడంతోపాటు బ్రెయిలీ కార్డులు, మరింత స్పష్టంగా కనిపించే లేబుళ్లను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. ఔషధాల లేబుళ్ల గురించి వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించి చూపులేని వారికి కూడా ఔషధాల ప్యాకేజింగ్‌పై పూర్తి అవగాహన కలిగే విధంగా ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్‌సీఓ) ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తున్నది.
డ్రగ్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ) ఇచ్చే సిఫార్సులను పురస్కరించుకుని ప్యాకేజింగ్‌కి సంబంధించిన సమస్యలను సమగ్రంగా పరిశీలించేందుకు ఓ ఉప కమిటీని సీడీఎస్‌సీఓ ఏర్పాటు చేస్తుంది. ఔషధ ఉత్పత్తులకు లేబులింగ్‌పై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన డీసీసీ వివిధ రాష్ర్టాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కమిటీ సిఫార్సులను పంపించనున్నది.
సులభంగా చిరిగిపోయే పేపర్‌పైన ముద్రిస్తున్న ఎక్స్‌పైరీ తేదీలు, లేబుళ్లపై ముద్రిస్తున్న అక్షరాలు మరీ చిన్నవిగా, చదవడానికి వీల్లేని విధంగా ఉండడం వంటి ఫిర్యాదులను ప్రభుత్వం డీసీసీ దృష్టికి తీసుకువెళ్లింది. జూన్ 17న జరిగిన సమావేశంలో డీసీసీ దృష్టికి వచ్చిన ఫిర్యాదులలో మెడిసిన్ పేర్లను ఒకే చోట ముద్రించడం, బ్రాండెడ్ ఔషధాల నుంచి జనరిక్ ఔషధాలు ప్రత్యేకంగా కనపడేందుకు వీలుగా ఒకే సింబల్ ఉండేలా చూడడం వంటివి ఉన్నాయి.
వినియోగదారుల నుంచి వచ్చిన అన్ని ఫిర్యాదులను కమిటీ సవివరంగా చర్చిస్తుందని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. చూపులేని వినియోగదారుల కోసం బ్రెయిలీ కార్డులను చేర్చడం, వాయిస్ అసిస్టెన్స్‌తో కూడిన క్యూర్ కోడ్లను ప్యాకేజింగ్‌లో చేర్చడం వంటివి కూడా డీసీసీ పరిశీలనలో ఉన్నట్లు ఆ అధికారి చెప్పారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు