కోల్‌కతాలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

కోల్‌కతాలో లా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

* ప్రధాన  నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి నేత

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతాలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కస్బా పరిసరాల్లో ఓ న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. బుధవారం రాత్రి 7:30 నుంచి 8:50 గంటల మధ్య కాలేజ్‌ క్యాంపస్‌ లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటి వరకూ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.  బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను గురువారం రాత్రి అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం కోల్‌కతాలోని స్థానిక కోర్టులో హాజరుపరిచారు.

వాదనల అనంతరం న్యాయమూర్తి ముగ్గురు నిందితులను నాలుగు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించారు. నిందితుల్లో ఇద్దరు బాధితురాలు చదువుతున్న కళాశాలలో ఆమెకు సీనియర్లని పోలీసులు తెలిపారు. మరొకరు కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థి అని వెల్లడించారు. ప్రధాన నిందితుడు లా కాలేజీ మాజీ విద్యార్థి అయిన మనోజిత్ ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌ విద్యార్థి విభాగానికి జనరల్ సెక్రటరీగా గుర్తించారు.  

బాధితురాలు (24) తన ఫిర్యాదులో ప్రధాన నిందుతుడు మనోజిత్ మిశ్రా గురించి షాకింగ్ వాస్తవాలు చెప్పింది. పెళ్లికి అంగీకరించలేదనే అక్కసుతో తనను బ్లాక్ మెయిల్ చేశాడని, వదిలేయాలని ఎంత వేడుకున్నా సరే వదల్లేదని వాపోయింది

“మనోజిత్ నన్ను పెళ్లి చేసుకోవాలంటూ పులమార్లు వేధించాడు. శృంగారంలో పాల్గొనాల్సిందిగా నన్ను తరచూ బలవంతం చేసేవాడు. కానీ, నేను తలొగ్గలేదు. అతడిని ఎదిరించాను. బలాన్నంత కూడదీసుకొని గట్టిగా వెనక్కి తోసేశాను. అయినా సరే అతడు రాక్షసుడిలా ప్రవర్తించాడు. నన్ను వదిలేయాలని ఏడ్చాను. కాళ్లు పట్టుకొని బతిమిలాడాను. నాకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, అతడితోనే జీవితాన్నిఊహించుకుంటున్నానని చెప్పాను. కానీ, మనోజిత్ నా పట్ల పశువులా ప్రవర్తించాడు. నన్ను బలవంతంగా గార్డ్ రూమ్‌లోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు” అని బాధితురాలు తన ఫిర్యాదులో వెల్లడించింది. 

అంతేకాదు, తనను వాళ్లు ఆస్ప్రతికి కూడా తీసుకెళ్లేందుకు నిరాకరించారని, ప్రధాన గేటుకు తాళం వేసి వెళ్లారని బాధితురాలు తెలిపింది. వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. పైగా, మనోజిత్ బాధితురాలి ప్రియుడికి హాని తలపెడుతానని, ఆమె కుటుంబ సభ్యులను తప్పుడు కేసులో ఇరికించి పోలీసులకు పట్టిస్తానని ఆమెను భయపెట్టాడు. ఈ 

విషయాల గురించి మాట్లాడుదాం ఆమెను జూన్ 25న కాలేజీ లోపలికి రావాలని కోరాడు. అయితే, ఆమె అక్కడికి వెళ్లాక మనోజిత్ మరో ఇద్దరి విద్యార్ధులు కలిసి ఆ అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆ రోజు రాత్రి 7:30 గంటల నుంచి రాత్రి10:50 మధ్య జరిగినట్టు పోలీసులకు బాధితురాలు తెలిపింది ఈ ఘటనపై కోల్‌కతా మేయర్‌ ఫిర్హాద్‌ హకీమ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఇది చాలా తీవ్రమైన సంఘటన అని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఇంకా పూర్తి సమాచారం తనకు అందలేదని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరోవైపు అత్యాచార ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బంగాల్‌లోని విద్యాసంస్థలు విద్యార్థినులకు సురక్షితం కాదనే విషయాన్ని ఆర్జీకర్‌తో పాటు తాజా ఘటన తెలియజేస్తోందని కేంద్ర సహాయ మంత్రి, బంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకంతా మజుందార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంశాఖను స్వయంగా ముఖ్యమంత్రి మమత బెనర్జీనే పర్యవేక్షిస్తున్నా, బంగాల్‌లో శాంతి భద్రతలు అదుపులో లేవని విమర్శించారు. 

అత్యాచారాన్ని నిరసిస్తూ భారీ నిరసన ప్రదర్శన చేపడతామని బంగాల్ ప్రతిపక్ష నాయకుడు సువేంధు అధికారి తెలిపారు. మమత బెనర్జీకి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునే అర్హత లేదని వెంటనే ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిందితుల్లో ఒకరు తృణముల్ కాంగ్రెస్‌కు చెందిన సభ్యుడు ఉన్నాడని బీజేపీ ఐటీ సెల్ జాతీయ కన్వీనర్ అమిత్ మాలవీయ ఆరోపించారు. తృణముల్ కాంగ్రెస్ నాయకులతో అతడు దిగిన ఫొటోలను ఎక్స్‌లో పోస్టు చేశారు.

కోల్‌కతా న్యాయ కళాశాల అత్యాచార ఘటనను జాతీయ మహిళా కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. మూడు రోజుల్లోగా పూర్తి నివేదికను తమకు అందించాలని కోల్‌కతా పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ కోల్‌కతా పోలీసు కమిషనర్ మనోజ్ వర్మకు లేఖ రాశారు. అత్యాచార ఘటనపై దర్యాప్తును త్వరితగతిన ప్రారంభించి నిర్దిష సమయంలోగా పూర్తి చేయాలని విజయ రహత్కర్‌ లేఖలో పేర్కొన్నారు. బాధితురాలికి వైద్య, న్యాయ సాయం అందించటంతో పాటు బీఎన్‌ఎస్‌ఎస్‌లోని సెక్షన్ 396 ప్రకారం పరిహారం అందించేలా చూడాలని ఆమె సూచించారు.