
ఈ తీర్పును భారత విదేశాంగ శాఖ శుక్రవారం రోజే తీవ్ర స్వరంతో తిరస్కరించింది. ది హేగ్‌లో ఉన్న మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానాన్ని తాము ఎన్నడూ గుర్తించనే లేదని తేల్చి చెప్పింది. భారత్‌లోని కిషన్ గంగ, రాత్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై ఆ కోర్టు జారీ చేసిన సప్లిమెంటల్ అవార్డును తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. సింధూ నదీజలాల ఒప్పందం అమలును ఆపేయాలని ఏప్రిల్‌లో తాము తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
ఆ విషయంలో తాము వెనక్కి తగ్గేది లేదని తెలిపింది. మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానాన్నే తాము గుర్తించడం లేదని, అలాంటప్పుడు కిషన్ గంగ, రాత్లే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై పాక్ అభ్యంతరాలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామని భారత్ ప్రశ్నించింది. పాక్ ఉగ్రవాదానికి నిలయంగా మారిందని, ఈ అంశం నుంచి అంతర్జాతీయ సమాజాన్ని, అంతర్జాతీయ వేదికలను పక్కదోవ పట్టించేందుకే మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానాన్ని ఆశ్రయించిందని భారత విదేశాంగ శాఖ విమర్శించింది.
గత కొన్ని దశాబ్దాలుగా ఇదే విధంగా ప్రపంచ దేశాలను పాక్ మోసగిస్తోందని మండిపడింది. ది హేగ్‌లోని మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానపు రాజ్యాంగ నిబంధనలు సింధూ నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా ఉన్నాయని, అందుకే అది ఇచ్చే తీర్పులను చట్టవిరుద్ధమైనవిగా పరిగణిస్తామని భారత్ వెల్లడించింది. 1960లో భారత్, పాక్ మధ్య సింధూ నదీజలాల ఒప్పందం కుదిరింది. ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ మరుసటి రోజే సింధూ నదీజలాల ఒప్పందం అమలును ఆపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది.
మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానం (పీసీఏ) నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో ఉన్న పీస్ ప్యాలెస్ వేదికగా పనిచేస్తుంటుంది. 1899లో ఒక ఒప్పందం ద్వారా ఈ కోర్టు ఏర్పాటైంది. ఇదే నగరంలో ప్రఖ్యాత అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసిజె) కూడా ఉంది. అయితే, ఐసీజేతో మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానానికి ఎలాంటి సంబంధం లేదు. ఐక్యరాజ్యసమితిలోని దేశాలన్నీ ఐసీజే పరిధిలోకి వస్తాయి.
మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానం అనేది స్వచ్ఛందమైనది మాత్రమే. ఇరు పక్షాల మధ్య ఆమోదం కుదిరితేనే ఈ కోర్టులో విచారణకు సహకరిస్తాయి. లేదంటే సహకరించవు. వివిధ దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు, ప్రైవేటు కంపెనీలు తమ ప్రయోజనాలకు విఘాతం కలిగినప్పుడు ఈ కోర్టును ఆశ్రయిస్తుంటాయి. కాగా, సింధూ నదీజలాల ఒప్పందం అనేది ఇప్పుడు అత్యంత ప్రాధాన్య అంశమని, దానిపై అర్ధవంతమైన చర్చలకు ఇరుదేశాలు మార్గాలను వెతకాల్సిన అవసరం ఉందని పాక్ సర్కారు పేర్కొంది.
ఈ నదీజలాల వినియోగంపైనా చర్చ జరగాలని కోరింది. మధ్యవర్తిత్వ శాశ్వత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అనేది తమకు కీలకమైన న్యాయవిజయంగా పాక్ అభివర్ణించింది. సింధూ నదీజలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేయడమో, ఒప్పందాన్ని పక్కదోవ పట్టించడమో చెల్లదనే సందేశాన్ని న్యాయస్థానం ఇచ్చిందని తెలిపింది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా