ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మఢ్ అడవుల్లో మే 21వ తేదీన జరిగిన ఎన్‌కౌంటర్లో చనిపోయిన సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శి నంభాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) ఆధీనంలోని ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ఢిల్లీలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిషేధిత సిపిఐ (మావోయిస్ట్) కీలక సమాచారం, ఆయుధ సరఫరాదారులు, ఆర్థిక వనరులు, భవిష్యత్ ప్రణాళికల వివరాలను వెలికితీసే పనిలో దర్యాప్తు ఏజెన్సీలు బిజీగా ఉన్నాయి.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి మావోయిస్టు అగ్రనేతకు చెందిన ఎన్‌క్రిఫ్టెడ్ ఫోన్, హార్డ్ డిస్క్, ల్యాప్ ట్యాప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఢిల్లీలోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో అధికారులు డీకోడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బస్తర్ రేంజీ ఐజీ పి. సుందర్ రాజ్ మాట్లాడుతూ ఈ పరికరాలను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలిస్తున్నారని, వీటిలో మావోయిస్టు కార్యకలాపాలు, నెట్ వర్క్, ఆయుధ సరఫరాదారులు తదితర విలువైన సమాచారం ఉంటుందని తాము నమ్ముతున్నట్టు తెలిపారు.
మరొక అధికారి మాట్లాడుతూ, బసవరాజు దశాబ్దాలుగా మావోయిస్టు అగ్రశ్రేణి నాయకుడని, 2003 నుంచి జరిగిన అన్ని ప్రధాన దాడులకు సూత్రధారి అని పేర్కొన్నారు. అతని ఎలక్ట్రానిక్ పరికరాలు సీపీఐ (మావోయిస్ట్) సంస్థ, దాని కార్యకలాపాల గురించి గతంలో పోలీసులు పొందలేని కీలక సమాచారాన్ని అందిస్తాయని పేర్కొన్నారు.
సాయుధ పోరాటంతో మాత్రమే తమ లక్ష్యాలను సాధించగలమని బసవరాజు బలంగా నమ్మాడని, అందుకే దేశీయంగా, విదేశాల్లోని ఆయుధ డీలర్లతో సంబంధాలు కొనసాగించాడని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిధులు, నియామకాలు, ఇతర సారూప్య భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలను కూడా ప్లాన్ చేసి ఉంటాడని ఆయన వెల్లడించారు.
శ్రీలంక తమిళ ఈలం టైగర్స్ (ఎల్‌టీటీఈ) దగ్గరే మందు పాతరలు పేల్చే నైపుణ్యాన్ని సంపాదించారని, చైనా, టర్కీ, తదితర దేశాల్లోని సాయుధ కమ్యూనిస్టులతో ఆయనకు సబంధాలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ స్థితిలో మావోయిస్టు నెట్ వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడానికి, మావోయిస్టు అగ్ర నాయకత్వం దగ్గర సమాచారమే కీలకం. అది బసవరాజు పరికరాల్లో లభిస్తుందని నమ్ముతున్నట్టు పోలీసు అధికారి తెలిపారు.
కనీసం 25 మంది కేడర్‌తో రక్షణ పొందిన ఈ అగ్ర మావోయిస్టు తలపై ఎన్ కౌంటర్ జరిగిన రోజు నాటికి రూ. 1.5 కోట్ల బహుమతి ఉంది. 2003లో అలిపిరిలో అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుపై జరిగిన క్లేమోర్ మైన్ దాడితో సహా అనేక కేసులలో అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్ 2010లో చింతల్నార్ మారణకాండకు కూడా ఇతనే సూత్రధారి. ఈ ఘటనలో మావోయిస్టులు పెట్రోలింగ్ నుంచి తిరిగి వస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడి చేసి 74 మంది సైనికులను చంపారు.
More Stories
బిహార్ యువతకు స్వరాష్ట్రంలోనే ఉపాధి కల్పించే లక్ష్యం
తొలి టెస్టులో భారత్ వెస్టిండీస్‌పై ఘన విజయం
ఉగ్రవాదం ఆపకపోతే ప్రపంచపటంలో పాక్ ఉండదు!