పాక్ లో ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు మృతి

పాక్ లో ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు మృతి

పొరుగు దేశం పాకిస్థాన్‌లో సైనిక కాన్వాయ్‌ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 16 మంది సైనికులు మరణించారు. పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ ఆప్ఘనిస్థాన్‌ సరిహద్దుకు సమీపంలో ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. తాలిబన్ అనుబంధ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్) కు చెందిన ఆత్మాహుతి బాంబర్, విస్ఫోటకాలు నిండిన వాహనాన్ని సైనిక కాన్వాయ్‌పైకి ఢీకొట్టాడు.

మరో 20 మందికి పైగా గాయపడ్డారు, వారిలో పౌరులు, పిల్లలు, పోలీసు సిబ్బంది, అధికారులు ఉన్నారు. ఈ పేలుడుతో పక్కనే ఉన్న రెండు ఇళ్ల పై కప్పులు కూలిపోవడంతో ఆరుగురు చిన్నపిల్లలు గాయపడ్డారు. స్థానిక పోలీసుల ప్రకారం, శిథిలాల కింద మరింతమంది ఉండే అవకాశముందని భావిస్తున్నారు. పునరావాస, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఈ దాడికి బాధ్యత హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ తీసుకున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా సైనిక కదలికలపై దాడులు జరపడానికి ముందుగానే పన్నిన కుట్ర అని పాక్ భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.  2021లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, పాకిస్తాన్-ఆఫ్ఘన్ సరిహద్దు ప్రాంతాల్లో హింసాత్మక దాడులు పెరిగాయని ఇస్లామాబాద్ ఆరోపించింది.

2025 ప్రారంభం నుండి ఖైబర్ పఖ్తుంఖ్వా మరియు బలూచిస్తాన్ రాష్ట్రాలలో దాదాపు 290 మంది, ముఖ్యంగా భద్రతా సిబ్బంది, తాలిబన్ మద్దతుదారుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ భద్రతా వ్యవస్థలపై కొనసాగుతున్న ఈ దాడులు పాక్ లోతైన ఉగ్రవాద సమస్యను మరోసారి బయటపెడుతున్నాయి.