
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు. దీంతో శుభాంశు శుక్రా తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అభినందనలు తెలిపారు. ఆక్సియం -4 మిషన్‌లో భాగంగా శుక్లా సహా నలుగురు వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ గురువారం సాయంత్రం ఐఎస్‌ఎస్‌తో డాకింగ్ ప్రక్రియ పూర్తయింది.
“ప్రియమైన నా తోటి భారతీయులకు ఓ చిన్న సందేశం. నేను 634వ వ్యోమగామిని. ఐఎస్‌ఎస్‌కు రావడం గర్వంగా ఉంది. అయితే మీ ప్రేమ, ఆశీస్సుల వల్ల నేను ఐఎస్‌ఎస్‌కు చేరుకున్నా. ఇక్కడ నిలబడటం చూడటానికి తేలికగా ఉన్నా, నా తల కొంచెం భారంగా మారింది. కాస్త ఇబ్బందిగా ఉంది. కొన్ని రోజుల్లో అన్నీ అలవాటు అయిపోతాయి. ఈ ప్రయాణంలో ఇదే తొలిమెట్టు. రానున్న రోజుల్లో శాస్త్రీయ పరిశోధనలు చేపడతా. మీతో మాట్లాడుతూనే ఉంటా. ప్రయాణం చాలా బాగుంది” అని సందేశం పంపారు.
ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సేంటర్ నుండి 424 కి.మీ ఎత్తులో ఉన్న కేంద్రానికి 28 గంటల ప్రయాణం విజయవంతమైంది. డాకింగ్ ప్రక్రియ అనేది క్రూ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానించే విధానం. ఇది చాలా కీలకం. డాకింగ్ ప్రారంభించే ముందు క్రూ క్యాప్సూల్ మొదట అంతరిక్ష కేంద్రంతో కలవాల్సి వుంది. అవి రెండూ ఒకే కక్షలో ఉండాలి, అలాగే ఒకదానికొకటి దగ్గరగా ఉండాల్సి వుంది.
ఇందుకోసం క్రూ క్యాప్సూల్, అంతరిక్ష కేంద్రాల మధ్య స్థానం, వేగం, దిశను సరిపోల్చడం ద్వారా కచ్చితమైన స్థానికీకరణ తో పాటు సంక్లిష్టమైన ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుంది. గురువారం సాయంత్రం 4.30గంటలకు (భారత కాలమానం ప్రకారం) మిషన్ కంట్రోల్ ‘సాఫ్ట్ క్యాప్చర్’ను నిర్థారించింది. అంటే అంతరిక్ష నౌక (క్రూ క్యాప్సూల్), అంతరిక్ష కేంద్రాన్ని తాకే సమయంలో ఉత్పత్తి అయ్యే గతిశక్తిని కొంత స్థలాన్ని అనుమతించే కనెక్షన్, నిమిషాల తర్వాత హార్డ్ క్యాప్చర్ అంటే మరింత బలవమైన కనెక్షన్ నిర్థారించబడింది.
అయితే శుక్లాతో పాటు డ్రాగన్ క్యాప్సూల్‌లోని ముగ్గురు వ్యోమగాములు ఐఎస్‌ఎస్‌లోని మిగిలిన ఏడుగురు వ్యోమగాములను వెంటనే చేరుకోరు. స్టేషన్‌తో కనెక్షన్‌ను స్థిరం చేసేందుకు, సీల్‌లో ఎటువంటి విచ్ఛిన్నం జరగకుండా లేదా వ్యోమగాముల భద్రతకు హాని కలిగించే లింక్‌తో ఏదైనా సమస్య లేదని నిర్థారించుకునేందుకు మరి కొంత సమయం పడుతుంది.
ఐఎస్‌ఎస్, డ్రాగన్ క్యాప్సూల్‌ను వేరుచేసే హాచ్ సాయంత్రం 6.10 గంటలకు (భారత కాలమానం ప్రకారం) తెరుచుకుంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లాతోసహా నలుగురు వ్యోమగాములు వెళ్లిన డ్రాగన్ వ్యోమనౌక ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం డాకింగ్ చాలా సంక్లిష్ట, సున్నిత ఆపరేషన్. ఇందుకోసం డ్రాగన్ వ్యోమనౌక తన వేగాన్ని, స్థితిని అత్యంత కచ్చితత్వంతో అంతరిక్ష కేంద్రంతో సమన్వయం చేసుకుంది.
లెక్కల్లో ఎక్కడ తేడా వచ్చినా ప్రమాదం పొంచి ఉంటుంది. అందువల్ల డ్రాగన్ వ్యోమనౌక చాలా నెమ్మదిగా దగ్గరైంది. ఈ క్రమంలో స్వల్పస్థాయి సర్దుబాట్లనూ అత్యంత కచ్చితత్వంతో చేసుకుంది. అంతిమంగా అది ఐఎస్‌ఎస్‌కు చెందిన హార్మనీ మాడ్యూల్‌తో అనుసంధామైంది.
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజులపాటు గడపనుంది. వారు దాదాపు 60 ప్రయోగాలు చేస్తారు. అందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్‌లలో మైక్రో గ్రావిటీ పరిశోధనలున్నాయి. ప్రధాని మోదీతో సంభాషించటంసహా అంతరిక్షం నుంచే శుక్లా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యోమగాములు 14 రోజులపాటు స్థానికంగా లభించే ఆహారాన్నే తీసుకోనున్నారు.
తన సహచర వ్యోమగాముల గురించి శుభాంశు మాట్లాడుతూ అంతరిక్షంలోకి రావాలని ఎంతో కాలంగా చూస్తున్నానని, ఇక్కడున్న వ్యోమగాములు తలుపులు తెరచి స్వాగతం పలుకుతుంటే ఇంట్లోకి స్వాగతం చెప్పినట్లు అనిపించిందని చెప్పారు. నిజంగా అద్భుతమని, ఇదో కొత్త అనుభూతని పేర్కొన్నారు. శాస్త్ర పరిశోధనల్లో భాగంగా తదుపరి 14 రోజులు తమతో కలిసి పనిచేస్తాననే పూర్తి విశ్వాసం ఉందని వెల్లడించారు
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన