
తమ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడి కేవలం న్యూక్లియర్ అంశాలపై కాదని, అణు శుద్దీకరణ గురించి అసలే కాదని, కానీ ఇరాన్ లొంగిపోవాలన్న కాంక్షతో అమెరికా దాడులకు ప్రయత్నించిందని ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ ఆరోపించారు.
ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ తర్వాత తొలిసారిగా దేశాన్ని ఉద్దేశించి టివిలో ప్రసంగించిన ఆయన ఓ సారి మానవ హక్కులు, ఓ సారి మహిళా హక్కులు, ఓ సారి అణు కేంద్రాల అంశం, ఓ సారి మిస్సైళ్ల గురించి అమెరికా వత్తిడి తెస్తుందన్నారు. వాస్తవానికి ఈ అంశాల కన్నా.. తాము లొంగిపోవాలన్న ఉద్దేశంతోనే అమెరికా దాడులకు దిగినట్లు ఖమేనీ వెల్లడించారు.
ఇజ్రాయెల్‌పై విజయం సాధించామన్న ఇరాన్ సుప్రీంలీడర్ ఖమేనీ, అమెరికాను చాచి లెంపకాయ కొట్టామని చెప్పారు. ఖతార్‌లోని అమెరికా బేస్‌ను తమ క్షిపణులు ధ్వంసం చేశాయని వెల్లడించారు. ఇజ్రాయెల్ అంతం అవుతందనే కారణంతో అమెరికా జోక్యం చేసుకుందని ఆయన తెలిపారు. దీని వల్ల అమెరికాకు ఎలాంటి ప్రయోజనం అందుకోలేదని చెప్పారు.
`లొంగుబాటు’ అన్న పదం తమ నిఘంటువులో లేదని పేర్కొంటూ. ఇరాన్ ప్రజలు ఐక్యతను ప్రదర్శించినట్లు ఖమేనీ మెచ్చుకున్నారు. తామంతా ఒకే స్వరాన్ని వినిపించినట్లు చెప్పారు. లొంగిపోవాలని ట్రంప్ పేర్కొన్నారని, కానీ ఇరాన్ లాంటి గొప్పదేశానికి ఆ పదం ఓ అవమానం అని ఆయన స్పష్టం చేశారు. అమెరికా తన నైజాన్ని చెప్పకనే చెప్పేసిందని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌ను ఆ దేశం వ్యతిరేకిస్తున్న విషయం స్పష్టమైందని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ జూన్ 19న అజ్ఞాతంలోకి వెళ్లారు. ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లకు దూరంగా రహస్య బంకర్‌లో ఉన్నట్లు అధికారికంగా తెలిపారు. కాల్పుల విరమణ తర్వాత కూడా ఆయన నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో చాలా మంది ఖమేనీ ఎక్కడంటూ ప్రశ్నించారు. తాజాగా ఇరాన్ ప్రభుత్వ టీవీలో ఈ అంశంపై ఖమేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ అధిపతి మెహదీ ఫజైలీని ప్రశ్నించారు.
దీనికి ఆయన కూడా సూటిగా సమాధానం చెప్పలేదని న్యూయార్క్ టైమ్స్ పత్రిక కథనంలో పేర్కొంది. దాదాపు 12 రోజులుగా సాగిన ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధంతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. జూన్ 13న ఇరాన్లోని అణు స్థావరాలు, మిలిటరీ కమాండర్లు, శాస్త్రవేత్తలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. అనంతరం ఇరాన్ సైతం దీనిపై ప్రతిస్పందించింది.
More Stories
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు
మహిళల కోసం జైషే ఆన్ లైన్ ‘జీహాదీ కోర్స్’