రాజ్యాంగంలో `సోషలిస్ట్’, `లౌకికవాదం’ పదాలపై చర్చ జరపాలి

రాజ్యాంగంలో `సోషలిస్ట్’, `లౌకికవాదం’ పదాలపై చర్చ జరపాలి
 
* ఎమర్జెన్సీ విధించినందుకు కాంగ్రెస్ దేశానికీ క్షమాపణ చెప్పాలి!
 
అత్యవసర పరిస్థితి విధించినందుకు కాంగ్రెస్ దేశానికి క్షమాపణ చెప్పాలని కోరడమే కాకుండా, అత్యవసర పరిస్థితి రోజుల్లో రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన “సోషలిస్ట్”, “సెక్కులరిజం”  పదాలు కొనసాగాలా? వద్దా? అనే దానిపై చర్చ జరపాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ  దత్తాత్రేయ హోసబలే కోరారు.
 
ఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో అత్యవసర పరిస్థితిపై ప్రముఖ జర్నలిస్ట్ రామబహదూర్ రాయ్ రచించిన గ్రంధాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి ఆవిష్కరిస్తూ  కాంగ్రెస్ గురించి ప్రస్తావించకుండా ప్రసంగిస్తూ, “అత్యవసర పరిస్థితిని విధించిన వారు రాజ్యాంగాన్ని చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నారు. వారు దానిపై దేశానికి క్షమాపణ చెప్పలేదు. వారు దానికి క్షమాపణ చెప్పాలి. మీ పూర్వీకులు అలా చేసి ఉంటే, వారి తరపున క్షమాపణ చెప్పండి” అని డిమాండ్ చేశారు. 
 
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా “సోషలిస్ట్”. “సెక్కులరిజం” పదాలను రాజ్యాంగ ప్రవేశికలో చేర్చడం గురించి హోసబాలే మాట్లాడుతూ, “సోషలిస్ట్”, “లౌకికవాదం” పదాలను ప్రవేశికలో చేర్చిన తరువాత వాటిని తొలగించడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదని చెప్పారు. కాబట్టి, అవి అలాగే ఉండాలా? వద్దా? అనే దానిపై చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు.
 
భావజాల దృక్కోణం నుండి, సోషలిజం భారతదేశానికి శాశ్వతమైనదిగా పరిగణించబడాలా? అని ఆయన ప్రశ్నించారు. “లౌకికవాదం అనే పదం మొదట భారత రాజ్యాంగంలో లేదు. దానిని ప్రవేశికలో చేర్చారు. లౌకికవాదం ఆలోచనలు ఉనికిలో ఉండవచ్చు. వాటిని పాలన, ప్రభుత్వ విధానాలాలో భాగంగా ఉండవచ్చు, అది వేరే విషయం. కానీ ఈ రెండు పదాలు ప్రవేశికలో ఉండాలా? ఇది ఆలోచించాల్సిన విషయం ”అని హోసబలే చెప్పారు.
 
ప్రజాస్వామ్య సంస్థలు తీవ్రంగా బలహీనపడిన సమయంలో ఈ మార్పులు జరిగాయని హోసబాలే గుర్తు చేస్తూ “… పౌరుల హక్కులు నిలిపివేసినప్పుడు, పార్లమెంటు అసమర్థంగా ఉన్నప్పుడు, న్యాయవ్యవస్థ నిర్వీర్యం చేయబడినప్పుడు, ఆ సమయంలో, దీనిని చేర్చారు” అని తెలిపారు.
 
“బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఉన్న భవనంలో (అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్) నేను ఈ మాట చెబుతున్నాను. ఆయన రాజ్యాంగ ప్రవేశికలో ఈ పదాలు లేవు” అని గుర్తు చేశారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో, అనేక మంది ఇండియా కూటమి నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వివిధ ర్యాలీలలో రాజ్యాంగ ప్రతిని ఊపుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దానిని “మార్చడానికి ప్రయత్నిస్తోందని” ఆరోపించారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్ట్ రామ్ బహదూర్ రాయ్ తోపాటు మాజీ బిజెపి ప్రధాన కార్యదర్శి కె ఎన్ గోవిందాచార్య 1975లో అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన జయప్రకాష్ నారాయణ్ నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అత్యవసర పరిస్థితి గురించిన చర్చ అంటే ఆ సమయంలో 21 నెలల పాటు జైళ్లలో నెట్టివేయబడిన “పాత తరం వారి చర్చ వేదిక” మాదిరిగా కాకుండా దేశంలో తిరిగి అత్యవసర పరిస్థితి మనస్తత్వం తలెత్తకుండా యువతకు అవసరమైన సమాచారం అందించాలని హోసబల్ సూచించారు.
 
అత్యవసర పరిస్థితి గురించి అవగాహన కల్పించడానికి విశ్వవిద్యాలయాలలో అధ్యయన వేదికలను నిర్వహించాలని ఆయన సంఘ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కు పిలుపునిచ్చారు. ఆ కాలంలో వేలాది మందిని జైలులో ఉంచి హింసించడమే కాకూండా న్యాయ వ్యవస్థ, మీడియా స్వేచ్ఛను కూడా తగ్గించారని హోసబాలే గుర్తు చేశారు.
 
1975 జూన్ 26 ఉదయం బెంగళూరులోని ఎమ్మెల్యేల గెస్ట్ హౌస్ వెలుపల అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్ కె అద్వానీలు అరెస్టు కావడాన్ని తాను చూసినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. ఒక పార్లమెంటరీ కమిటీ సమావేశం కోసం వచ్చిన వారిని అక్కడ ఉంచారు.  “ఒక ప్రకటన ఇవ్వడానికి పిటిఐ, యుఎన్‌ఐలకు ఫోన్ చేయాలని అద్వానీజీ చెప్పారు. ఆ ప్రకటనను ప్రచురించడానికి ఎవరు సిద్ధంగా ఉంటారు? అని అటల్జీ ఆయనను అడిగారు?” అని హోసబాలే వివరించారు. 
 
కానీ ఆ పరీక్షా సమయాల్లో భారత ప్రజలు ప్రజాస్వామ్యంగా తమ పరిణతిని నిరూపించుకున్నారని కూడా తెలిపారు. తన తాతగారి అంత్యక్రియలు నిర్వహించడానికి తన మామకు పెరోల్ పొందడానికి వెళ్ళినప్పుడు, తాను రాత్రంతా పోలీస్ స్టేషన్ వెలుపల వేచి ఉండాల్సి వచ్చిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గుర్తు చేసుకున్నారు. అత్యవసర పరిస్థితి కథను యువతకు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉందని, తద్వారా అది మరచిపోకూడదని ఆయన స్పష్టం చేశారు.