
అమెరికా వీసాలకు అప్లై చేసుకునే విద్యార్థులు ఇక నుంచి డీఎస్-160 ఫామ్‌లో దరఖాస్తుదారులు తప్పకుండా గత ఐదేళ్లలో వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని పొందుపర్చాలి. ఒకవేళ ఆ వివరాలను పొందుపర్చకుంటే దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో వీసాలను పొందే అవకాశం కూడా చేజారొచ్చు.
ఎఫ్, ఎం, జే కేటగిరీలకు చెందిన నాన్ ఇమిగ్రెంట్ వీసాలకు అప్లై చేసే వారికి భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం ఈ మేరకు నూతన వీసా స్క్రీనింగ్ నిబంధనలను అమల్లోకి తెచ్చింది. విద్యార్థులతో పాటు అమెరికా కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రాం కోసం దరఖాస్తు చేసుకునే వారంతా సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పబ్లిక్ మోడ్‌లో పెట్టుకోవాలని అమెరికా ఎంబసీ సూచించింది.
డీఎస్-160 ఫామ్‌లో పొందుపరిచిన సమాచారం ప్రకారం వారి ప్రొఫైల్స్‌ను తాము తనిఖీ చేసి వేరిఫై చేస్తామని తెలిపింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న భారతీయ విద్యార్థులు, అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్న భారతీయ విద్యార్థుల విషయంలో గత కొన్ని నెలలుగా ఇలాంటి కఠినమైన నిబంధనలనే అమెరికా అమలు చేస్తోంది. వాటికి కొనసాగింపుగానే డీఎస్-160 ఫామ్‌లో సోషల్ మీడియా ఖాతాల సమాచారాన్ని తప్పకుండా పొందుపర్చాలనే నిబంధనను తీసుకొచ్చారు.
ఈ నిబంధనల వల్ల రాబోయే రోజుల్లో అమెరికా వీసాలను పొందడం మరింత కష్టతరంగా మారొచ్చని పరిశీలకులు అంటున్నారు. ఎఫ్-1 అనేది స్టూడెంట్ వీసా. అమెరికాలోని విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందాలంటే ఈ వీసాను పొందాలి. జే-1 అనేది అమెరికా స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమానికి ఎంపికయ్యే వారికి మంజూరు చేసే వీసా. అమెరికాలో వొకేషనల్ కోర్సులు చేసేందుకు ఎం-1 వీసాను పొందాలి.
‘‘వీసా నిబంధనలను అమెరికా బాగా కఠినతరం చేస్తోంది. అమెరికా వీసాలకు దరఖాస్తు చేస్తున్న భారతీయ విద్యార్థుల్లో 95 శాతం మంది సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పబ్లిక్ మోడ్‌లోనే ఉంచుతున్నారు. మిగతా 4 నుంచి 5 శాతం మంది అమెరికాకు బదులుగా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్లే యోచన చేస్తున్నారు’’ అని విదేశీ విద్యా సర్వీసులు అందించే నిపుణులు చెబుతున్నారు.
More Stories
అరబ్-ఇస్లామిక్ నాటో… ఇస్లామిక్ దేశాల సైనిక కూటమి
తృతీయ పక్షం జోక్యం ఒప్పుకొని భారత్.. పాక్ స్పష్టం
ఆసియా కప్ నుంచి రిఫరీని తొలగించేందుకు ఐసిసి తిరస్కారం