ప్రారంభమైన పూరీ జగన్నాథుని రథయాత్ర

ప్రారంభమైన పూరీ జగన్నాథుని రథయాత్ర
ప్రపంచ ప్రసిద్ధికెక్కిన పూరీ జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు జరిగే రథయాత్రను కన్నులారా వీక్షించేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పూరీ  క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. వేల సంఖ్యలో భక్తులు ‘జై జగన్నాథ్‌’, ‘హరిబోల్‌’ నినాదాలతో రథం వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నారు.

ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఒడిశా ప్రభుత్వం తొలిసారిగా 275 ఏఐ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. 12 రోజుల పాటు కొనసాగనున్న ఈ వేడుకకు దేవస్థానం వారు దాదాపు రెండు నెలల ముందు నుంచే ఈ యాత్రకు ఏర్పాట్లు చేశారు. 

సాధారణంగా హిందూ ఆలయాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. కానీ, దీనిక భిన్నంగా పూరీలో మూల విరాట్టునే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. అంతేకాదు, ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. అంతేకాదు, రాజు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. 

జగన్నాథుడు, బలభద్రుడు, తమ సోదరి సుభద్ర దేవిలతో కలిసి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని.. అక్కడ వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడటం ఒక అదృష్టంగా భావిస్తారు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. 

ఈ ముగ్గురు దేవతలు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంత కాలం గడుపుతారు. తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్​ 27న మొదలైన ఈ రథయాత్ర జులై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఇలానే పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా అప్రతిహతంగా జరుగుతూనే ఉంది.

పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కనుక అధికారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు 10,000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. వీరిలో ఒడిశా పోలీసులు సహా సెంట్రల్ ఆర్మ్​డ్​ ఫోర్స్​ (సీఏపీఎఫ్)కు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి.  ఇటీవలే జమ్మూకశ్మీర్​లోని పహల్గామ్​లో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన దృష్ట్యా, పూరీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు.

“రథయాత్ర భద్రత కోసం ప్రత్యేకంగా భవనాలపై ఎన్​ఎస్​జీ స్నిప్పర్​ కమాండోలను మోహరించాం. యాంటీ-డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నాం. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కోసం డ్రోన్​లను కూడా మోహరిస్తున్నారు. యాంటీ-సాబోటేజ్ బృందాలు, బాంబ్​ స్క్వాడ్​లు, డాగ్ స్క్వాడ్​లను కూడా రంగంలోకి దించాం” అని ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు. రథయాత్ర దృష్ట్యా ఒడిశాలోని సముద్రతీరంలోనూ భద్రత పెంచారు. ఒడిశా మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్​లు సహా భారత నావికాదళం కూడా ఇందుకోసం రంగంలోకి దిగిందని డీజీపీ తెలిపారు. రథయాత్ర మొదటి రెండు రోజుల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు డీజీపీ తెలిపారు.