చైనాతో ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు సూత్రాలు

చైనాతో ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు సూత్రాలు
చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్ సి ఓ) రక్షణ మంత్రుల సమావేశానికి హాజరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం చైనా రక్షణ మంత్రి అడ్మిరల్‌ డాంగ్‌జున్‌ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డాంగ్‌జున్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.  ఉభయ దేశాల మధ్య నెలకొన్న సంక్లిష్ట సరిహద్దు సమస్యలను “శాశ్వత సంప్రదింపులు, ఉద్రిక్తతలను తగ్గించడం కోసం నిర్మాణాత్మక రోడ్ మ్యాప్” ద్వారా పరిష్కరించాల్సిన అవసరాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
 
రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి శాశ్వతంగా ఉద్రిక్తతలను తగ్గించే మార్గంగా ప్రస్తావించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రెండు వైపులా ఉన్నత స్థాయి ప్రముఖుల మధ్య సమావేశాల తర్వాత జరిగిన ఇదివరకటి ప్రకటనలలో, ఇరుపక్షాల మధ్య సంబంధాల ద్వారా, సరిహద్దుల వెంట శాంతి, ప్రశాంతతను కొనసాగించడం ద్వారా నమ్మకం, అవగాహన, విశ్వాసాన్ని పెంపొందించడాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తూ ఉండేవారు.  కాగా, సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి, చైనాతో దౌత్య సంబంధాలను మెరుగుపరచడానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్‌నాథ్‌ ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
నాలుగు  అంశాల్లో 2024లో బలగాల ఉపసంహరణ కోసం చేసుకున్న ఒప్పందానికి ఇరు దేశాలు కట్టుబడి ఉండటం, సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలను పూర్తిగా చల్లార్చేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగించడం, సరిహద్దుల మార్కింగ్, డీలిమిటేషన్ ప్రక్రియను వేగవంతం చేసి వివాదాలకు శాశ్వత ముగింపు పలకడం, ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలన పరిష్కరించుకొని సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఇప్పటికే ఉన్న ప్రత్యేక ప్రతినిధుల స్థాయి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కొత్త ప్రక్రియలను రూపొందించడం ఉన్నాయి. 

ఇక ఈ భేటీలో ఉగ్రవాదం, ఆపరేషన్‌ సిందూర్‌ వంటి అంశాలను కూడా చైనా రక్షణ మంత్రి ముందు రాజ్‌నాథ్‌ ప్రస్తావించారు.  చైనా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా స్పందించనప్పటికీ, ఈ చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని భారత వర్గాలు పేర్కొన్నాయి. 2024 అక్టోబర్ తర్వాత చైనా రక్షణ మంత్రితో రాజ్‌నాథ్ సింగ్ జరిపిన రెండవ సమావేశం కాగా, తూర్పు లడఖ్‌లో నాలుగు సంవత్సరాలకు పైగా సైనిక ప్రతిష్టంభన తర్వాత ఇరుపక్షాలు సేనల ఉపసంహరణకు అంగీకరించాయి. తాజాగా జరిగిన సమావేశం చైనా రక్షణ మంత్రితో ఆయన జరిపిన నాల్గవ ద్వైపాక్షిక సమావేశం.