
జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అమర్‌నాథ్ యాత్రపై ప్రభావం చూపింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు పది శాతం మేర తగ్గాయి. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం ఈ విషయం తెలిపారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్లు 10.19 శాతం మేర తగ్గినట్లు చెప్పారు.
ఏప్రిల్ 22కు ముందు పేర్లు నమోదు చేసుకున్న వారు యాత్రలో పాల్గొనడాన్ని మళ్లీ ధృవీకరించుకోవాలని ఆయన కోరారు. 85,000 మందికిపైగా ప్రజలు అమర్‌నాథ్ యాత్ర చేపట్టాలని భావిస్తున్నారని వెల్లడించారు. కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రదాడి జరుగకముందు 2.36 లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మనోజ్ సిన్హా తెలిపారు.
ఉగ్రదాదుల కాల్పుల్లో 26 మంది పర్యాటకులు మరణించిన తర్వాత రిజిస్ట్రేషన్ నమోదు తగ్గిందన్నారు. అయితే జమ్ముకశ్మీర్ పరిపాలన యంత్రాంగం, భద్రతా దళాలు తీసుకున్న చర్యలు యాత్రికుల్లో విశ్వాసాన్ని పెంచాయని చెప్పారు. దీంతో యాత్ర రిజిస్ట్రేషన్లు మళ్లీ పెరుగుతున్నాయని వివరించారు. మరోవైపు జూలై 3 నుంచి ఆగస్టు 9 వరకు కొనసాగనున్న అమర్‌నాథ్ యాత్ర కోసం పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు.
బేస్ క్యాంపుల వద్ద మూడు అంచెల భద్రత ఉంటుందని చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని, మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నాయని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో హెలికాప్టర్ ప్రమాదాలు, భద్రతా సమస్యలు వంటి అనేక కారణాల వల్ల ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు హెలికాప్టర్ సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్‌లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం