
మహారాష్ట్ర ఓటరు జాబితాను మెషీన్ రీడబుల్ డిజిటల్ ఫార్మాట్‌లో ఇవ్వాలంటూ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాసిన లేఖను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) తప్పుపట్టింది. ఆ డిమాండ్ ఆమోదయోగ్యం కానే కాదని స్పష్టం చేసింది. ఆ సమాచారాన్ని ఇతరులకు అందించేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ అనుమతించదని గురువారం ఈసీ తేల్చి చెప్పింది.
ఇదే విధమైన డిమాండ్‌తో దాఖలైన ఓ పిటిషన్‌ను 2019లో సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయాన్ని ఈసందర్భంగా గుర్తు చేసింది. మెషీన్ రీడబుల్ డిజిటల్ ఓటర్ల జాబితాను ఇవ్వమని గత ఏడు నెలలుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడుగుతూనే ఉన్నారని, కాంగ్రెస్ నుంచి ఈ డిమాండ్ రావడం కొత్తేమీ కాదని కేంద్ర ఎన్నికల సంఘం అధికార వర్గాలు తెలిపాయి.
గత ఎనిమిదేళ్లుగా కాంగ్రెస్ ఇదే విధమైన డిమాండ్లను లేవనెత్తుతోందని, వాటిలోనే కొద్దిపాటి మార్పులు చేసి ఇప్పుడు మరో డిమాండ్ చేసినట్లుగా కనిపిస్తోందని పేర్కొన్నాయి. 2018లో నాటి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లోనూ మెషీన్ రీడబుల్ డిజిటల్ ఫార్మాట్‌లోని ఓటరు జాబితాలను అందించాలని కోరారని ఈసీ అధికార వర్గాలు చెప్పాయి.
ముసాయిదా ఓటర్ల జాబితాను ఆనాడు టెక్ట్స్ మోడ్‌లో పిటిషనర్ కమల్‌నాథ్‌కు అందించామని వెల్లడించాయి. ఎన్నికల నియమావళిలోని క్లాజ్ 11.2.2.2లోనూ టెక్ట్స్ మోడ్ అనే ప్రస్తావన మాత్రమే ఉంటుందని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో సెర్చబుల్ పీడీఎఫ్ రూపంలో ముసాయిదా ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలనే అంశమేదీ ఈ క్లాజ్‌లో లేదని చెప్పారు.
మరోవైపు, దేశంలోని వివిధ రాజకీయ పార్టీలపై ఎన్నికల సంఘం చర్చలు తీసుకుంది. రాజకీయ పార్టీగా నమోదై ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై కొరడా ఝుళిపించింది. 2019 నుంచి ఇప్పటి వరకు గడిచిన ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని 345 గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలను (రిజిష్టర్డ్ అన్‌రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్) గుర్తించి వాటిని డీలిస్ట్ చేసే ప్రక్రియను గురువారం ప్రారంభించింది ఈసీ.
ఆయా పార్టీల కార్యాలయాలు కూడా ఎక్కడా లేవని గుర్తించిన ఎన్నికల సంఘం, ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే ఈసీ విడుదల చేసిన జాబితాలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పార్టీలు ఉన్నాయి. కాగా, ఎన్నికల సంఘం వద్ద సుమారు 2800కి పైగా గుర్తింపులేని నమోదిత రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక పార్టీ గుర్తింపు పొందాలంటే సాధారణ ఎన్నికల్లో కనీసం 6% ఓట్లను లేదా నిర్దిష్ట సంఖ్యలో సీట్లను సొంతం చేసుకోవాలి.
More Stories
రైతులకు మరో రెండు పథకాలు ప్రారంభించిన ప్రధాని మోదీ
చొరబాట్లేతోనే ముస్లిం జనాభా అసాధారణంగా పెరుగుదల
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం