ఇజ్రాయిల్- ఇరాన్ కాల్పుల విరమణతో డాలర్ విలువ పతనం

ఇజ్రాయిల్- ఇరాన్ కాల్పుల విరమణతో డాలర్ విలువ పతనం

గత వారం భారీగా పెరిగిన అమెరికా డాలర్ విలువ ఇప్పడు కుప్పకూలిపోతోంది. ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధం సమయంలో గర్జించిన యూఎస్ డాలర్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారీ స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి అకస్మాత్తుగా కుప్పకూలింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 

ప్రధానంగా అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశాలు కనిపిస్తుండటంతో డాలర్ బలహీనపడుతోంది. పతనంతో ఇతర దేశాల కరెన్సీల విలువ భారీగా పెరగనుంది. పశ్చిమాసియా దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య గత వారం వరకు డాలర్ విలువ అమాంతం పెరిగింది.

ట్రంప్ చేసిన కాల్పుల విరమణ ప్రకటనతో డాలర్ విలువ తగ్గడం ప్రారంభమైందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఈ రోజు అమెరికా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో డాలర్ విలువ దాదాపు నాలుగేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. అమెరికా డాలర్ ఇండెక్స్ 97.48కి పతనమైంది. డాలర్ పతనం వల్ల యూరో భారీగా పుంజుకుంది. దాని విలువ ప్రస్తుతం 1.1700 యూరోలకి చేరుకుంది. 

ఈ ఏడాది పాలసీ రేట్లలో మరింత తగ్గింపు అంచనాలు పెరగడం వల్ల డాలర్ బలహీనపడిందని నార్త్ అమెరికా మాక్రో స్ట్రాటజీ హెడ్ స్టీవ్ ఇంగ్లాండర్ తెలిపారు. దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు కూడా డాలర్ పతనానికి కారణమవుతున్నాయి.దీని కారణంగా దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే భయాన్ని ఇంగ్లాండర్ వ్యక్తం చేశారు. 

ట్రంప్ సుంకాల విధానాలు ప్రపంచ మార్కెట్లో అనిశ్చితికి కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని జెపి మోర్గాన్ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య విధానంపై తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల ఇలా ఉంటే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్థానంలో వేరొకరిని నియమించాలని పరిశీలిస్తున్నట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఒక నివేదిక తెలిపింది. 

కాగా పావెల్ పదవీకాలం మే 2026లో ముగుస్తుంది. అతని స్థానంలో వచ్చే అధికారి తీసుకునే చర్యలు అమెరికా మార్కెట్లను కదిలిస్తాయా లేదా అనేది కూడా చూడాల్సి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యూరప్‌లోని నాటో మిత్రదేశాలు కీలక నిర్ణయాన్ని ప్రకటించడంతో యూరో విలువ ఒక్కసారిగా పెరిగింది.