29న అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు

29న అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు

కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీడియూగా 29 తేదీన నిజామాబాద్ లో  ప‌సుపు బోర్డును ప్రారంభిస్తున్నట్లు కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి నిజామాబాద్  లో తెలిపారు. పసుపు రైతుల ఆకాంక్ష పసుపు బోర్డు కోసం అనేక పోరాటాలు చేశారని, అనేక పార్టీలు హామీలు ఇచ్చాయని, కానీ ఎంపీ అరవింద్ కృషి, ప్రధాని మోదీ ఆశీస్సులతో పసుపు బోర్డు ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 

పసుపు బోర్డుకు సంబంధించి కార్యక్రమాలకు కేంద్రంగా నిజామాబాద్ ను ఎంపిక చేయడం గొప్ప నిర్ణయమని చెప్పారు.  పసుపు ఎక్కువ ఉత్పతి చేసే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లో బోర్డు ఏర్పాటు కోసం అడిగారని, కానీ ప్రధాని మాత్రం నిజామాబాద్ లోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జిల్లా వాసులకు గొప్ప బహుమతి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 

రైతు బిడ్ణను బోర్డు చైర్మన్ ను చేయడం గొప్ప నిర్ణయం అంటూ నిజామాబాద్ రైతు ఉద్యమాలకు కేంద్ర బిందువు, చైతన్యానికి ప్రతీక అని చెప్పారు. కాగా, ఫోన్‌ ట్యాపింగ్‌తో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బ్లాక్‌మెయిలింగ్‌ రాజకీయాలకు పాల్పడిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. రేవంత్‌ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్యాపింగ్‌ కేసును సీబీఐకి ఇవ్వాలని పదే పదే కోరారని గుర్తు చేస్తూ అధికారంలోకి వచ్చి 18 నెలలు కావస్తున్నా ఆ ఊసే ఎత్తడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.

రేవంత్‌ బీఆర్‌ఎ్‌సతో కుమ్మక్కు కాకపోతే ఆ కేసును వెంటనే సీబీఐకి ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సిబిఐ చేత దర్యాప్తు చేయాలని బీజేపీ పిటిషన్ వేసిందని చెబుతూ సరిగా జరగని ఎడల న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేసారు.  హైకోర్టు న్యాయమూర్తులతో పాటు వ్యాపారులు, సినిమా వాళ్లు, మీడియా వాళ్ళను వదలకుండా అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని తెలిపారు. వ్యక్తి స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికి లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఇంతటి దారుణం మరొకటి లేదన్నారు.

అనంతరం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ డే ఫొటో ఎగ్జిబిషన్‌ను కిషన్‌ రెడ్డి తిలకించారు. కాగా, నిజామాబాద్‌లోని ఆర్యనగర్‌లో ఏర్పాటు చేయనున్న పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని కిషన్‌ రెడ్డి గురువారం పరిశీలించారు. ప్రారంభోత్సవానికి త్వరితగతిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరంలోని పాలిటెక్నిక్‌ మైదానంలో నిర్వహించనున్న రైతు సమ్మేళన సభ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపీ అరవింద్, పసుపు బోర్డు చైర్మన్ గంగారెడ్డి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయణ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.