మూడేళ్ళలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్

మూడేళ్ళలో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా భారత్
వచ్చే మూడేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ మరింత దూసుకుపోనుందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ తెలిపారు. 2027 నాటికి భారత్‌ 5 ట్రిలియన్‌ డాలర్ల (రూ.430 లక్షల కోట్లు) జిడిపి సాధించొచ్చని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం, వ్యాపార సంఘాలు, పరిశ్రమలు సహా 140 కోట్ల మంది భారతీయులు ముందుకు వెళ్తున్నారని పేర్కొన్నారు. 
మర్చంట్స్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండిస్టీ (ఎంసిసిఐ) ఏర్పాటు చేసిన ఓ వర్చూవల్‌ సెషన్‌లో మంత్రి పియూష్‌ గోయల్‌ మాట్లాడుతూ బలమైన స్థూల ఆర్థిక పునాదితో దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థ దృఢంగా ఉందని చెప్పారు. దేశంలో ద్రవ్యోల్బణం అత్యల్పంగా మూడు శాతానికి తగ్గిందని తెలిపారు. 
 
భారత్‌ 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థను అందుకోవడం కోసం మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ, వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గడం, కార్మికులతో తయారీకి ప్రాధాన్యం, ప్రపంచ మార్కెట్‌పై దృష్టి సారించడం వంటి వాటిపై కీలక చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగేలా భారత్‌ తనను తాను మలుచుకుందని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాబోయే దశాబ్ద కాలంలో దేశానికి డిజిటల్‌ మార్కెట్‌ కీలకమని చెప్పారు.
ప్రపంచంలో జపాన్‌ను అధిగమించి భారత్‌ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని ఇటీవల నీతి ఆయోగ్‌ తెలిపింది. దేశ స్థూల దేశీయోత్పత్తి 4.19 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.356 లక్షల కోట్ల)కు చేరుకుంది. జపాన్‌ కంటే భారత జిడిపి 4.187 బిలియన్‌ డాలర్లు అధికంగా ఉందని పేర్కొంది. అమెరికా, చైనా, జర్మనీ తరవాత స్థానంలో భారత్‌ ఉందని వెల్లడించింది.