దేశంలో తనకు భారత రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. రాజ్యాంగం కింద మిగిలిన మూడు విభాగాలు పని చేస్తాయని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతికి విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆయనను స్థానికులు ఘనంగా సత్కరించారు. అనంతరం జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ 1973లో కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సిజెఐ ప్రస్తావిస్తూ రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంట్‌కు అధికారాలున్నాయి కానీ రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని మార్చలేరని తెలిపారు. ప్రజాస్వామ్యంలో కార్యనిర్వాహక, శాసన మరియు న్యాయవ్యవస్థల్లో ఏ విభాగం అత్యున్నతమైనదో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని పేర్కొంటూ చాలా మంది పార్లమెంట్ అత్యున్నతమైనదని చెబుతుంటారనని గుర్తు చేశారు.
కానీ రాజ్యాంగమే అత్యున్నతమైనదని ఆయన తేల్చి చెప్పారు. ”ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసినంత మాత్రాన జడ్జి స్వతంత్రుడు కాడు. జడ్జి ఎల్లప్పుడు తన విధిని గుర్తుంచుకోవాలి. మనం ప్రజల హక్కులు, రాజ్యాంగ విలువలు, సూత్రాల సంరక్షకులం. మనకు అధికారం మాత్రమే లేదు. మనపై బాధ్యతలు కూడా ఉన్నాయి” అని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
ప్రజలు తీర్పుల గురించి ఏమనుకుంటున్నారు అనేది జడ్జీలను ప్రభావితం చేయకూడదని, మనం స్వతంత్రంగా ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రజలు (న్యాయవ్యవస్థ గురించి) చెప్పింది మన నిర్ణయాన్ని ప్రభావితం చేయదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కింద శాసన, న్యాయ, కార్యనిర్వహాక వర్గాలు పని చేస్తాయని, అయితే పార్లమెంటుకు సవరించే అధికారం ఉందని, కానీ అది రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాన్ని మాత్రం మార్చలేమని పేర్కొన్నారు.
రాజ్యాంగ విలువలతోపాటు సూత్రాలకు సంరక్షకుడిననే విషయాన్ని న్యాయమూర్తి నిత్యం గుర్తుంచుకోవాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి సంఘటనలను జస్టిస్ బీఆర్ గవాయ్ గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తాను ఆర్కిటెక్ట్ కావాలనుకున్నానని, కానీ తన తండ్రి మాత్రం న్యాయవాది కావాలని, అందుకోసం న్యాయ శాస్త్రం అభ్యసించాలని సూచించారని చెప్పారు. తన తండ్రి న్యాయవాది కావాలని అనుకున్నారని, కానీ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆయన జైలుకు వెళ్లడంతో, తన తండ్రి కల నెరవేరలేదని ఈ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్ వివరించారు.
More Stories
`బాబ్రీ మసీద్’కు భూమి పూజ నిప్పుతో చెలగాటం.. బిజెపి
లుధియానాలో అక్రమ బంగ్లాదేశీయులపై పోస్ట్ కు అరెస్ట్!
గంగ, ఓల్గా నదుల స్ఫూర్తి భారత్- రష్యాలకు మార్గనిర్ధేశం