
వచ్చే ఏడాది నుంచి రెండుసార్లు10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ఈ మేరకు ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణకు బోర్డు ఆమోదం తెలిపింది. బోర్డు నిర్ణయంతో సీబీఎస్‌ఈ విధానంలో 10వ తరగతి చదివే విద్యార్థులు వచ్చే ఏడాది అంటే 2026 నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాయాల్సి ఉంటుంది.
ఇందులో తొలి దఫా పరీక్షలు ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు మేలో జరుగుతాయి. తొలి విడత పదో తరగతి పరీక్షలను బోర్డు తప్పనిసరి చేసింది. రెండో విడత పదో తరగతి పరీక్షలను ఆప్షనల్‌గా పెట్టింది. రెండు విడతల్లో మంచి స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. రెండు దశలకు సంబంధించిన ఫలితాలు వరుసగా ఏప్రిల్, జూన్‌లో ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఏడాదికొకసారి ఇంటర్నల్ అసెస్మెంట్ ఉంటుందని ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యం భరద్వాజ్ వెల్లడించారు. “తొలి విడత పరీక్షలు ఫిబ్రవరిలో, రెండోవి మేలు జరుగుతాయి. వీటి ఫలితాలు ఏప్రిల్, జూన్లో విడుదలవుతాయి. ప్రతి విద్యార్థి తొలి విడత పరీక్షలు తప్పనిసరిగా రాయాలి. రెండో విడత ఎగ్జామ్స్ విద్యార్థులకు ఆప్షనల్. సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, భాషల్లో వారి మార్కులను మెరుగు పరుచుకునేందుకు మరోసారి రాసుకోవచ్చు” అని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సీబీఎస్‌ఈ పరీక్షల్లో మార్పులు చేయాలని నేషనల్ కరికులమ్ ఫ్రేమ్‌వర్క్ ముసాయిదా కమిటీ ఇప్పటికే సూచించింది. ఇస్రో మాజీ ఛైర్మన్ కె.కస్తూరిరంగన్ సారథ్యంలోని ఈ కమిటీ 11, 12వ తరగతి విద్యార్థులకు సెమిస్టర్ విధానాన్ని కూడా ప్రతిపాదించింది.
వాస్తవానికి, బోర్డు పరీక్షలను సంస్కరించడం ఇదే తొలిసారేమీ కాదు. 2009లో పదో తరగతికి సీసీఈ (కంటిన్యూస్, కాంప్రెహెన్సివ్ ఎవల్యూషన్) విధానాన్ని తీసుకువచ్చారు. ఆ తర్వాత 2017లో దీన్ని రద్దు చేసి, మళ్లీ పాత విధానాన్నే అమలుచేశారు. కరోనా సమయంలోనూ 10, 12 తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించినా, తిరిగి పాత పద్ధతినే కొనసాగిస్తున్నారు.
More Stories
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు