
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో జూలై 1న విచారణకు హాజరుకావాలని సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్‌కుమార్‌కు బుధవారం ఎసిబి నోటీసులు జారీ చేసింది. అప్పటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ఈ కేసులో ఏ2 నిందితునిగా ఎసిబి నమోదు చేశారు. అరవింద్ కుమార్ ప్రస్తుతం సెలవులో ఉన్నారు.
ఈ నెలాఖరు వరకు ఆయన సెలవులో ఉండటంతో జూలై 1న విచారణకు హాజరుకావాల్సిందిగా ఎసిబి నోటీసు జారీ చేసింది. తన కూతురు కాన్వకేషన్ కార్యక్రమానికి హాజరు కావడం కోసం ఆయన యూరప్ వెళ్ళారు. ఫార్ములా ఈ రేస్ కార్ నిర్వహణా ఒప్పందంలో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై జనవరిలో ఎసిబి విచారణ చేపట్టింది. ఆ తర్వాత ఈడి కూడా రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.
కాగా ఐదు నెలల విరామం తర్వాత ఈ నెల 16వ తేదీన అప్పటి మున్సిపల్‌శాఖ మంత్రి కెటిఆర్‌ను ఎసిబి విచారించింది. ఈ కేసులో ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఎసిబి కెటిఆర్‌ను విచారించింది. అలాగే ఈ కేసులో ఎసిబి అధికారులు ఈ కార్ నిర్వహణకు సంబంధించిన ఆర్ధిక శాఖ అనుమతులు, నియమ నిబంధనలు, స్పాన్సర్ల వివరాలు తదితర అంశాలపై కీలక సమాచారం సేకరించింది.
ఈ నేపథ్యంలో అరవింద్ కుమార్‌కు తాజాగా నోటిసులు ఇవ్వడంతో ఈ కేసులో ఎసిబి వేగం పెంచినట్టు అయింది. ఇటీవల కెటిఆర్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అరవింద్ కుమార్‌ను ఎసిబి విచారించనున్నట్టు సమాచారం.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత