
* శ్రీశైలం అడవులలో మావోయిస్టుల సంచారం?
శ్రీశైలంలోని ప్రధాన ఆలయం సమీపంలో ఉన్న వాసవి సత్రానికి ఎదురుగా ఉన్న రోడ్డు డివైడర్పై బాంబులు, బుల్లెట్లు లభించడంతో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. శ్రీశైలానికి వచ్చే ప్రముఖులందరూ వాసవి సత్రానికి సమీపంలోని శ్రీ కృష్ణ దేవరాయ గోపురం ప్రధాన ద్వారం వద్ద తమ వాహనాలను పార్క్ చేసి ఆలయ ప్రాంగణంలోకి నడచి వెళ్తుంటారు. అంతటి కీలకమైన ప్రదేశం సమీపంలో బాణసంచాతో పాటుగా బుల్లెట్లు లభించడం గమనార్హం.
ఇక్కడే ఎర్రటి వస్త్రం ఉండటంతో పోలీసులు మావోయిస్టుల కార్యకలాపాలపైనా దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో తిరుమల తర్వాత అతిపెద్ద ఆలయంగా శ్రీశైలం గుర్తింపు పొందినప్పటికీ, భద్రత చర్యలు మాత్రం అధ్వానంగా మారాయి. శ్రీశైలానికి వెళ్లేందుకు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయి. కర్నూలు – నంద్యాల వైపు నుంచి వచ్చేవారికి ఒక మార్గం, తెలంగాణ నుంచి వచ్చేవారికి మరొక మార్గం మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
అటవీ ప్రాంతాల చుట్టూ ఉన్నందున, రెండు మార్గాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, సంఘ వ్యతిరేక శక్తులు పుణ్యక్షేత్రం పరిధిలోకి ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కానీ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. అటవీ శాఖ చెక్‌పోస్టులు ఉన్నా వారి దృష్టి మారణాయుధాలపై ఉండడం లేదు. శ్రీశైలం, సున్నిపెంట ప్రాంతాలు నల్లమల అటవీ పరిధిలో ఉన్నందున, అక్కడ మాజీ మావోయిస్టుల హవా నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఆదిలాబాద్ పోలీసులు కొన్ని నెలల క్రితం సున్నిపెంటకు చెందిన వైఎస్సాఆర్సీపీ నాయకుడు వట్టి వెంకట రెడ్డిని, మరో ఇద్దరి వద్ద మారణాయుధాలు కలిగి ఉండడంతో పాటు ఒక వ్యక్తిని చంపడానికి కుట్ర పన్నారన్న ఆరోపణలపై అరెస్టు చేశారు. అతడు మాజీ మావోయిస్టు కావడంతో పోలీసులు అప్రమత్తమై నల్లమల ప్రాంతంపై దృష్టి సారించారు.
మావోయిస్టులు మళ్లీ బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్నారా? అన్న కోణంపై పోలీసులు విచారించారు. తాజాగా సోమవారం శ్రీశైలంలో బాంబులతో పాటు, బుల్లెట్లు ఓ ఎర్రని వస్త్రం కనిపించడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి శ్రీశైలానికి వచ్చే వారిని తనిఖీ చేయకపోవడంతో పాటు కనీసం ప్రధాన ఆలయంలోకి వెళ్లేవారిని కూడా తనిఖీ చేసే వ్యవస్థ కనిపించడం లేదు.
సర్వ దర్శనం, శీఘ్ర దర్శనం, అతి శ్రీఘ్ర దర్శనం వంటి తదితర సేవలకు టికెట్లు తీసుకునే వారికి మాత్రమే ప్రత్యేక క్యూ లైన్లు ఉన్నాయి. భక్తుల టిక్కెట్లను పరిశీలిస్తున్నాగానీ వారిని పూర్తిస్థాయిలో తనిఖీ చేయడం లేదు. ఆలయానికి వెళ్లే క్యూ లైన్ల మార్గాల్లో అక్కడక్కడా డోర్‌ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు ఉన్నప్పటికీ, వాటిలో చాలా వరకు పని చేయడం లేదు. పలువురు మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను యథేచ్ఛగా తీసుకువెళుతున్నా పట్టించుకోవడం లేదు.
ఆలయం లోపల సెల్ ఫోన్లు పని చేయకుండా నిరోధించడానికి జామర్లు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ దానిని ఇంకా అమలు కాలేదు. శ్రీశైలం ఆలయ భద్రతను పటిష్ఠంగా ఉండేలా పోలీసు, నిఘా, ఆక్టోపస్ విభాగం ఉన్నతాధికారులు పలు కీలక సిఫార్సులు చేశారు. భద్రత పరంగా చాలా లోపాలు ఉన్నాయని, వాటిని సరిచేసుకోవాలని చెప్పినా అస్సలు పట్టించుకోవడం లేదు.
More Stories
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ