ఒక వంక అంతర్గత కుమ్ములాటలు, పరస్పరం అవినీతి ఆరోపణలతో ఎన్నికల ముందు ప్రజల ముందుంచిన ఐదు గ్యారెంటీల అమలుకు డబ్బుల్లేక రెండేండ్ల కిందట కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన సిద్ధరామయ్య సర్కారు ఇరకాట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను పట్టించుకోకుండా ప్రభుత్వ పెద్దలు లంచాలకు మరిగిపోయారని సొంతపార్టీ నేతలే మండిపడుతున్నారు.
గ్యారెంటీలను అమలు చేయడంలో సర్కారు చేతులెత్తేసిన వైనాన్ని ఎండగడుతున్నారు. అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో మొత్తంగా కర్ణాటకలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితి నెలకొంది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్లల్లో భారీగా అవినీతి చోటు చేసుకొన్నదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఆరోపించారు.
నిజమైన పేదలకు కాకుండా లక్షల రూపాయలు లంచాలు ఇచ్చిన వారికే ఇండ్లను కేటాయించారంటూ ఆయన మాట్లాడిన ఆడియో ఒకటి ఇటీవల వైరల్‌గా మారింది. లంచాలు ఇచ్చి అక్రమంగా ఇండ్లు పొందిన వారి జాబితా కనుక బయటకు వస్తే కర్ణాటక ప్రభుత్వమే షేక్ అవుతుందని పాటిల్ హెచ్చరించారు. దీనిపై సీఎం ఆర్థిక సలహాదారు బపవరాజ్ రాయరెడ్డి మాట్లాడుతూ ‘అవినీతి అనేది ప్రపంచమంతటా ఉన్నదే కదా’ అనడం సంచలనంగా మారింది. సిద్ధరామయ్య ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి పాటిల్, రాయరెడ్డి వ్యాఖ్యలే నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
సిద్ధరామయ్య సర్కారు హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగడం లేదని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు వాపోయారు. ముఖ్యమంత్రే స్వయంగా రూ. 25 కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ పనులకు మోక్షం దక్కడం లేదని మండిపడ్డారు. తన నియోజకవర్గంలోని ఓ గ్రామంలో ఏడాది కిందట ఓ రోడ్డుకు శంకుస్థాపన చేస్తే ఇప్పటికీ పనులు మొదలు కాలేదని గుర్తు చేశారు.
ఫోన్లలోనూ మంత్రులు అందుబాటులో ఉండటం లేదని మండిపడ్డారు. గ్యారెంటీల అమలుకు నిధులు విడుదల కావడం లేదని, అన్నభాగ్య స్కీమ్‌ను కూడా నడపలేకపోతున్నామని ఎమ్మెల్యే ఎన్‌వై గోపాలకృష్ణ, ఎమ్మెల్సీ బేలూరు గోపాలకృష్ణ తదితరులు వాపోయారు. గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, సీఎం సిద్ధరామయ్య దగ్గర కూడా పైసలు లేవని స్వయంగా హోంమంత్రి జీ పరమేశ్వరనే ఒప్పుకొన్నారు.
క్షేత్ర స్థాయిలో ఐదు గ్యారెంటీలు అమలు కావడం లేదని కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో సొంత ప్రభుత్వంపైనే కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. ఇంకోవైపు, సీఎం సిద్ధరామయ్య వర్గం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వర్గం నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నది.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు