శుభాంశు శుక్లా రోదసి యాత్రపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు

శుభాంశు శుక్లా రోదసి యాత్రపై రాష్ట్రపతి, ప్రధాని ప్రశంసలు
భారతదేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా యాక్సియం-4మిషన్‌లో భాగంగా బుధవారం రోదసిలోకి వెళ్లడం ద్వారా దాదాపు 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత వ్యోమగామిగా ఆయన చరిత్రలో సృష్టించారు. ఈ మిషన్‌కు శుక్లా గ్రూప్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రయోగం విజయవంతం కావడంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం ప్రకటించారు.

ఫాల్కన్‌ 9 రాకెట్‌లో భారత్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా వెళ్లిన శుభాంశు శుక్లా భారత అంతరిక్ష చరిత్రలో కొత్త మైలురాయిని నెలకొల్పారని రాష్ట్రపతి కొనియాడారు. వారి ప్రయాణంపై దేశం మొత్తం సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ‘మీరు, యాక్సియం-4 మిషన్‌లోని ఇతర దేశాల వ్యోమగాములు కలిసి ప్రపంచం అంతా ఒకే కుటుంబమని నిరూపించారు.’ అని రాష్ట్రపతి ప్రశంసించారు.

నాసా, ఇస్రో మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ప్రతిబింబించే ఈ మిషన్‌ విజయవంతం కావాలని తాను ఆకాంక్షిస్తున్నానని రాష్ట్రపతి ముర్ము చెప్పారు. అక్కడ వ్యోమగాములు చేసే విస్తృత ప్రయోగాలు, శాస్త్రీయ అధ్యయనాలు, అంతరిక్ష యాత్రలకు ముందడుగుగా మారనున్నాయని రాష్ట్రపతి అభిలాష వ్యక్తం చేశారు.

ఇక భారత్‌, హంగెరీ, పోలాండ్‌, యూఎస్‌ వ్యోమగాములతో కూడిన స్పేస్‌ మిషన్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మోదీ వ్యోమగాములకు అభినందనలు తెలియజేశారు. భారత వ్యోమగామి, గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా చరిత్రలో నిలిచారని అభినందించారు. కోట్ల మంది భారతీయుల కలలు, కోరికలు, ఆకాంక్షలను ఆయన మోసుకెళ్లారని కొనియాడారు.

ఐఎస్‌ఎస్‌లో శుభాంశు బృందం 14 రోజులపాటు ఉంటుంది. భారరహిత స్థితిలో పలు ప్రయోగాలు నిర్వహించడంతోపాటు ప్రధాని మోదీ, పాఠశాల విద్యార్థులు, ఇతరులతో వ్యోమగాములు అక్కడి నుంచి ముచ్చటించనున్నారు. ఇలా ఉండగా, ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. 

ప్రయోగం చేపట్టిన ఎనిమిది నిమిషాల్లోనే ఈ రాకెట్‌ భూమికి చేరింది. వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్‌ క్యాప్సూల్‌ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే మార్గంలో నిర్ణీత సమయానికి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడిపోయింది. అనంతరం ఫాల్కన్‌ రాకెట్‌ తిరిగి సురక్షితంగా భూమికి చేరింది.  రోదసి యాత్రకు వెళ్లే ముందు శుభాన్షు తన ఎక్స్‌ ఖాతాలో కొన్ని ట్వీట్స్‌ చేశారు. ‘భారతదేశం అంతరిక్షంలోకి తిరిగి వస్తోంది.. జై హింద్’, ‘41 ఏళ్ల తర్వాత.. భారత జెండా మళ్లీ అంతరిక్షంలో ఎగురుతుంది.. జై హింద్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ‘భారత్‌ మానవ సహిత అంతరిక్ష యాత్ర ప్రారంభమైంది. జై హింద్‌.. జై భారత్‌’ అని శుభాన్షు పేర్కొన్నారు. 

రాకేశ్‌ శర్మ తర్వాత అంతరిక్షంలో అడుగుపెట్టనున్న రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరనున్న తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా రికార్డులకెక్కనున్నారు. ఫాల్కన్‌-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లగానే భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో యాక్సియం-4 మిషన్‌ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించిన శుభాంశు శుక్లా కుటుంబ సభ్యులు ఫాల్క్‌న్‌-9 రాకెట్ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా పయనమవ్వటంతో ఆనందంతో గంతులు వేశారు. తమ కుమారుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లుతుండటం ఆనందంగా ఉందని శుభాంశు శుక్లా తండ్రి శంభు దయాల్ శుక్లా తెలిపారు. దేవుడి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.