
తేజస్ మార్క్ 2, ఏఎంసీఏ వంటి ఐదో తరం యుద్ధ విమానాల్లో వినియోగించనున్న ఎఫ్-414 ఇంజిన్లను భారత్, అమెరికా కలిసి తయారు చేయనున్నాయి. దీనికి సంబంధించి వచ్చే ఏడాది మార్చికల్లా అమెరికా రక్షణ రంగ కంపెనీ జీఈ ఏరోస్పేస్‌తో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు ఒప్పందం కుదరనుందని హెచ్ఏఎల్ చీఫ్ డీకే సునీల్ వెల్లడించారు. భారత్‌కు చెందిన ఐదో తరం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎఎంసిఎ)లలో ఆ ఇంజిన్లను వినియోగిస్తామని ఆయన తెలిపారు.
2023లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయని చెప్పారు. అయితే ఎఫ్-414 ఇంజిన్ల తయారీ టెక్నాలజీని జీఈ ఏరోస్పేస్ నుంచి భారత్‌కు బదిలీ చేసే అంశంపై చర్చల్లో సాగదీత జరిగిందని, ఎట్టకేలకు ఈ కీలకమైన ఇంజిన్ల తయారీకి సంబంధించిన 80 శాతం టెక్నాలజీని భారత్‌కు బదిలీ చేసేందుకు అమెరికా అంగీకరించిందని డీకే సునీల్ వెల్లడించారు.
ఇప్పటికే అమెరికా, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాల యుద్ధ విమానాల్లో ఎఫ్-414 ఇంజిన్లను వినియోగిస్తున్నాయని ఆయన తెలిపారు. భారత ఆర్మీకి 156 తేలికపాటి ప్రచండ్ హెలికాప్టర్లను సరఫరా చేసే రూ.62,700 కోట్ల మెగా కాంట్రాక్టు కూడా తమకు లభించిందని డీకే సునీల్ చెప్పారు. 2028 నుంచి ఆర్మీకి ఈ హెలికాప్టర్ల సప్లైను మొదలు పెడతామని చెప్పారు. 4500 మీటర్లకుపైగా ఎత్తులోనూ ప్రచండ్ సైనిక హెలికాప్టర్లు ఎగరగలవని తెలిపారు. వాటిలో రాకెట్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లు కూడా ఉంటాయని తెలిపారు.
వచ్చే ఏడాది మార్చికల్లా భారత వాయుసేనకు ఆరు ‘తేజస్ ఎంకే-1ఏ’ రకం యుద్ధ విమానాలను అందిస్తామని డీకే సునీల్ పేర్కొన్నారు. జీఈ ఏరోస్పేస్ నుంచి సకాలంలో ఎఫ్404 ఇంజిన్లు అందనందువల్లే తేజస్‌లను వాయుసేనకు అందించడంలో జాప్యం జరుగుతోందని చెప్పారు. ఆరు ‘తేజస్ ఎంకే-1ఏ’లను తయారు చేసి సిద్ధంగా ఉంచామని, 2023 నుంచి ఇప్పటి వరకు ఒకేఒక ఎఫ్404 ఇంజిన్ జీఈ ఏరోస్పేస్ నుంచి అందిందని ఆయన చెప్పారు.
ఇప్పుడు జీఈ ఏరోస్పేస్ – హెచ్ఏఎల్ పరస్పర అవగాహనకు వచ్చినందున, 2026 మార్చిలోగా 12 ఎఫ్404 ఇంజిన్లు అందుతాయని తెలిపారు. అవి అందగానే వాయుసేనకు ఆరు ‘తేజస్ ఎంకే-1ఏ’లను డెలివరీ చేస్తామని డీకే సునీల్ చెప్పారు. జీఈ ఏరోస్పేస్ నుంచి సకాలంలో ఇంజిన్లు అందితే వచ్చే ఏడాది 16 ‘తేజస్ ఎంకే-1ఏ’లను భారత వాయుసేనకు అందిస్తామని పేర్కొన్నారు. పాత తరం మిగ్-21 యుద్ధ విమానాలను తొలగించి, వాటి స్థానాన్ని ‘తేజస్ ఎంకే-1ఏ’లతో భారత వాయుసేన భర్తీ చేయనుంది.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు