రూ.1,980 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం

రూ.1,980 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు ఆమోదం

సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం రూ.1,980 కోట్ల విలువైన అత్యవసర ఆయుధ, అనుబంధ పరికరాలు, యంత్రాల సేకరణ కోసం 13 ఒప్పందాలకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో భారత సైన్య సంసిద్ధతను బలోపేతం చేయడానికి చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో అత్యవసర సేకరణ అధికారల కింద 13 ఒప్పందాలను ఖరారు చేసింది.

ఆయుధాలు, మందుగుండు సామగ్రిని అత్యవసర సమయాల్లో నేరుగా కొనేలా రక్షణ దళాలకు ప్రత్యేక అధికారం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. తక్కువ స్థాయి తేలికైన రాడార్లు, తక్కువ శ్రేణి వాయు రక్షణ క్షిపణులు, లాంచర్లు, రిమోటెడ్ వైమానిక వాహనాలు, టేకాఫ్, ల్యాండింగ్ వ్యవస్థలతో సహా సంచరించే ఆయుధాలు వంటి సైనిక వ్యవస్థలను కొనుగోలు చేస్తున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

అత్యవసర సేకరణ విధానం కింద వివిధ రకాల డ్రోన్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బాలిస్టిక్ హెల్మెట్లను కూడా కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. భారత సైన్యానికి మంజూరు చేసిన మొత్తం రూ.2,000 కోట్లలో రూ.1,981 కోట్ల విలువైన ఒప్పందాలను ఖరారు చేసినట్లు వెల్లడించింది.

“ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో భారత సైన్యం కార్యాచరణ సంసిద్ధతను బలోపేతం చేయడానికి ఇదొక ముఖ్యమైన చర్య. అత్యవసర సేకరణ విధానం కింద రక్షణ మంత్రిత్వ శాఖ 13 ఒప్పందాలను ఖరారు చేసింది. ఈ కొనుగోళ్లు ఉగ్రవాద ప్రభావిత ప్రాంతంలో మోహరించిన సాయధ దళాలకు ఉపయోగపడతాయి. వారి రక్షణకు ఉపయోగపడతాయి”  అని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

మరోవైపు, అత్యవసర సేకరణ విధానం కింద సాయుధ దళాలకు డీఆర్డీఓ తాము అభివృద్ధి చేసిన 28 స్వదేశీ ఆయుధ వ్యవస్థలను అందించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ ఆయుధాలు బాగా పనిచేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం జరిగింది. భారత సైన్యానికి 14, నావికాదళానికి 8, వైమానిక దళానికి 6 సహా మొత్తం 28 స్వదేశీ ఆయుధ వ్యవస్థలను డీఆర్డీఓ అందించింది.

రక్షణ దళాలు ఒక ఉత్పత్తి కోసం రూ.300 కోట్ల వరకు ఖర్చు చేసే అధికారం కల్పించారు. కాగా, 155 ఎంఎం ఆర్టిలరీ గన్ల కోసం మందుగుండు సామగ్రి, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, స్మార్ట్ యాంటీ ఎయిర్‌ ఫీల్డ్ వెపన్స్, లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్, అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడోలను త్రివిధ దళాలను డీఆర్ డీఓ అందించింది.

“రాకెట్లు, ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్, ఎయిర్ టు గ్రౌండ్ క్షిపణులు, లేజర్ గైడెడ్ బాంబులు, టార్పెడోలు, నాగ్ క్షిపణులు, రుద్రం యాంటీ రేడియేషన్ క్షిపణులు, నావల్ యాంటీ షిప్ క్షిపణులు, గ్రెనేడ్‌లు ఉన్నాయి” అని రక్షణ శాఖ అధికారులు పేర్కొన్నారు. స్మార్ట్‌ యాంటీ ఎయిర్‌ ఫీల్డ్‌ వెపన్‌ కోసం మందుగుండు సామగ్రిని కొనుగోలు చేయాలని వైమానిక దళం యోచిస్తోంది. ఇది త్వరలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

భారత సాయుధ దళాలకు డీఆర్డీఓ ప్రధాన ఆయుధాల సరఫదారుగా ఉంది. బ్రహ్మోస్ సూపర్‌ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు, ఎంఆర్ఎఏఎం ఎయిర్ ఎడ్జ్ ఫెన్స్ క్షిపణి వ్యవస్థలు, ఆకాశ్ ఎయిర్ ఎడ్జ్ ఫెన్స్ వ్యవస్థలను అందించింది. ఇవి పాక్ పై చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో బాగా పనిచేశాయి.