ఆరు గ్యారెంటీల గురించి మంత్రివర్గంలో చర్చించరే?

ఆరు గ్యారెంటీల గురించి మంత్రివర్గంలో చర్చించరే?
తెలంగాణ మంత్రివర్గ సమావేశాల్లో ముఖ్యమైన ప్రజా సమస్యలపై చర్చ లేకుండా, కబుర్లతో కాలయాపన చేస్తున్నారని బిజెఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి  విమర్శించారు.   కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలు ఏమైంది? ఆరు గ్యారెంటీల గురించి ఇప్పటివరకు కేబినెట్ సమావేశంలో ఎందుకు చర్చించడం లేదు? వాటిని అమలు చేసే ప్రణాళికను ఎందుకు సిద్ధం చేయలేకపోతున్నారు?  అని ప్రశ్నించారు.

అనేకమైనటువంటి అంశాల్లో ఆరు గ్యారెంటీల విషయంలో చట్టబద్ధత లేకపోవడం, ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత కూడా వాటి మీద ఇంకా ముందుకు తీసుకువెళ్ళకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్ లో పేర్కొన్న హామీలు, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అంశం, మహాలక్ష్మి స్కీం కింద ప్రతి మహిళకు రూ. 2500 ఇస్తామన్న హామీ, దివ్యాంగులకు రూ. 6000 కు పెంచుతామన్న పెన్షన్ .. ఇలా అనేక అంశాలపై కేబినెట్ సమావేశంలో ఎందుకు చర్చించడం లేదు? అని నిలదీశారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాల కోసం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని మీరు ప్రకటించి, అసెంబ్లీ సాక్షిగా చట్టం కూడా తీసుకొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు.  ఈ ఏడాది మార్చి 17న అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇప్పటివరకు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకుండా జాప్యం చేయడమేంటి? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ సర్కారు కేవలం మభ్యపెట్టేందుకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ రాష్ట్రపతికి పంపించి చేతులు దులుపుకునేలా ప్రవర్తిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ హామీ ఇచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఇవ్వలేదు గదా అని విస్మయం వ్యక్తం చేశారు.  దాన్ని ఏ విధంగా అమలు చేస్తామనేది ప్రజల ముందు ఏవిధమైన స్పష్టత ఇవ్వకుండా అమలు చేస్తామంటూ చెప్పిన వారేఇప్పుడు దాటవేత వైఖరిని అవలంబించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్‌ను పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేశారు.  ఆడబిడ్డలకు వివాహ సమయంలో కళ్యాణలక్ష్మి పథకం ద్వారా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటివరకు ఎక్కడా తులం బంగారం ఇవ్వలేదని, ఇది ప్రజలను మోసం చేసిన స్పష్టమైన ఉదాహరణ అని దుయ్యబట్టారు.
 
అదేవిధంగా, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పి దానినీ నెరవేర్చలేదు. రైతు కూలీలకు ‘రైతు భరోసా’ పథకం, ప్రతి పంటకు బోనస్ అనే వాగ్దానాలు అమలుకు నోచుకోలేదని తెలిపారు.  గత రెండు సీజన్లలో రైతులకు చెల్లించాల్సిన బకాయిలను మీరు ఎప్పటిలోగా చెల్లిస్తారోననేది కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. దాదాపు 23,973 మందికి 42% రిజర్వేషన్ వల్ల లబ్ధి కలుగుతుందంటూ బీసీ సోదర సోదరీమణులకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాట గుర్తు లేనట్టు దాటవేసే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.


ఇక 11 నెలలుగా మున్సిపాలిటీలు, 15 నెలలుగా పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు జరగకపోవడంతో గ్రామీణాభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని,  ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని బీజేఎల్పీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరన్నర కాలంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వకుండా ఎందుకు దాటవేస్తోందని నిలదీశారు.

రైతు భరోసా పథకం ఈ సీజన్‌కి చివరిదైపోతోందన్న అనుమానం ప్రజల్లో గట్టిగా వినిపిస్తోందని చెబుతూ తర్వాత ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదన్న చర్చ వస్తోందని ఆరోపించారు. రైతుల ఆకాంక్షలను నిర్లక్ష్యం చేస్తే, బిజెపి ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని హెచ్చరించారు. రైతు కూలీల కోసం ‘రైతు భరోసా’ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.900 కోట్లు కేటాయిస్తామంటూ హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు కేవలం రూ.1.2 కోట్లు మాత్రమే కొంతమందికి ఇచ్చి, మిగతా లబ్ధిదారులను పూర్తిగా విస్మరించిందని ధ్వజమెత్తారు.

రుణమాఫీ విషయంలో కూడా ప్రభుత్వం కేవలం 60%-65% వరకే అమలు చేసి, మిగిలిన లక్షలాది మంది రైతులకు మోసం చేసిందని చెప్పారు.
జూన్ 2న ప్రారంభిస్తామని ప్రకటించిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని ఇప్పటికీ పెండింగ్‌లో ఉంచిన రాష్ట్ర ప్రభుత్వం, లక్షల్లో దరఖాస్తులు వచ్చినప్పటికీ వాటిని ఎలా ప్రాసెస్ చేసిందో స్పష్టత ఇవ్వలేకపోయిందని విమర్శించారు. లక్షలోపు ఆదాయం ఉన్న యువతకు నేరుగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పిన కాంగ్రెస్.. వారందరినీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారికంగా 16,23,000 దరఖాస్తులు వచ్చినట్లు ప్రకటించినప్పటికీ, ఒక్క దరఖాస్తును కూడా ప్రాసెస్ చేయకుండా ప్రజలను నిరాశకు గురిచేశారని చెప్పారు. ప్రతి స్కీమ్ ఒక స్కాం అని, బీఆర్ఎస్ నాయకులను వెయ్యి సంవత్సరాల జైలుకైనా పంపించడం తక్కువే అని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని అంటూ విస్మయం వ్యక్తం చేశారు.