అంత‌రిక్షంలోకి తెలుగ‌మ్మాయి జాహ్నవి దంగేటి

అంత‌రిక్షంలోకి తెలుగ‌మ్మాయి జాహ్నవి దంగేటి
 
* అమ్మమ్మ చెప్పిన చందమామ కథలతో అంతరిక్షంపై మక్కువ పెంచుకున్న యువతి
ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లుకు చెందిన 23 ఏళ్ల యువతి జాహ్నవి దంగేటి అంతరిక్షంలోకి అడుగుపెడుతున్న తొలి భారతీయ మహిళగా  ఘనత సాధించ‌నుంది. అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ చేపట్టిన టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆమెగా ఎంపికయ్యారు. ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు నాసా మాజీ వ్యోమగామి, రిటైర్డ్ కల్నల్ విలియం మెక్ ఆర్థర్ జూనియర్ నాయకత్వం వహించనున్నారు.
ఇప్పటివరకు భారత్‌లో జన్మించి, ఇక్కడే నివసిస్తున్న మహిళ నేరుగా అంతరిక్ష యానానికి ఎంపిక కాలేదు. అయితే టైటాన్‌ స్పేస్‌ ప్రతినిధులు పలుమార్లు నిర్వహించిన పరీక్షలన్నీ పూర్తిచేసిన జాహ్నవి ఈ స్పేస్‌ మిషన్‌కు అర్హత సాధించింది. టైటాన్‌ స్సేస్‌ రోదసీలో భారీ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయోగ, వాణజ్య, పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదద్దనుంది. ఈ మిషన్‌లో భాగంగా తొలుత కొద్దిమంది అంతరిక్ష పరిశోధక వ్యోమగాములు, పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.
 
ఈ సందర్బంగా జాహ్నవి మాట్లాడుతూ  ‘అమ్మ, నాన్న కువైట్‌లో ఉద్యోగం చేస్తున్నారు. నేను అమ్మమ్మ దగ్గరే పెరిగా. మా అమ్మమ్మ లీలావతి చందమామ కథలు చెప్పేది. దీంతో నేను అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కనేదాన్ని’ అని తెలిపింది. 2026 నుంచి రాబోయే మూడేళ్లపాటు టైటాన్ స్పేస్  అనలాగ్  ప్రోగ్రామ్‌లో ఆమె కఠినమైన వ్యోమగామి శిక్షణ పొందనున్నాను.
ఈ శిక్షణలో ఆమెకు ఫ్లైట్ సిమ్యూలేషన్, స్పేస్‌ క్రాఫ్ట్ ప్రొసీజర్లు, సర్వైవల్ ట్రైనింగ్, మెడికల్, సైకాలజికల్ అసెస్‌మెంట్లు ఉండనున్నాయి. 2029లో ఐదు గంటలపాటు సాగనున్న ఈ ఆర్బిటల్ స్పేస్ ఫ్లైట్‌ ద్వారా శాస్త్రీయ పరిశోధన, మానవ అంతరిక్ష పరిశోధనకు ఓ కొత్త దిక్సూచి ఏర్పడనుందని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

జాహ్నవి పాలకొల్లులో జన్మించి అక్కడే పెరిగింది. బీటెక్ పూర్తి చేసిన ఆమెకు చిన్నపాటి నుండే అంతరిక్షం పట్ల చాలా ఆసక్తి. ఇందులో భాగంగానే 2022లో పోలాండ్‌ లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందిన జాహ్నవి, అతి చిన్న వయస్సులోనే అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది జాహ్నవి.

అప్పటి వరకు భారతదేశం నుంచే కాదు, ఆసియా ఖండం నుంచి పాల్గొన్న ప్రోగ్రామ్‌ లో తొలి సందర్భం అది. ఇకపోతే జాహ్నవి ఇప్పటికే చిన్న రాకెట్ అయిన ‘సెస్నా 171 స్కైహాక్’ ను విజయవంతంగా నడిపి రికార్డ్ సృష్టించింది. జీరో గ్రావిటీ, మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, అండర్‌ వాటర్ రాకెట్ లాంచ్, ఎయిర్ క్రాఫ్ట్ డ్రైవింగ్ వంటి అంశాల్లో శిక్షణ పొందింది కూడా. ఆమె 16 దేశాల యువతతో కూడిన బృందానికి ఫ్లైట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించింది. అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన దాదాపు అన్ని నైపుణ్యాలను ఆమె నేర్చేసుకుంది. 

స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్ లెవెల్ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా కూడా నీటి లోతుల్లో గ్రావిటీయేని పరిసరాల్లో పనిచేయగల సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంది. తల్లిదండ్రులు కువైట్‌లో ఉద్యోగాల్లో ఉండడంతో జాహ్నవి విజయాల వెనుక ఉన్న అసలైన శక్తి ఆమె అమ్మమ్మ లీలావతి. అమ్మమ్మ దగ్గర పెరిగిన జాహ్నవి చందమామ కథలు వింటూ పెరిగింది. 

ఆ కథలే ఆమె మనసులో అంతరిక్షం పట్ల ఆసక్తిని రేపాయి. ఐదవ తరగతిలోనే కరాటే నేర్చుకున్న జాహ్నవి నేషనల్, ఇంటర్నేషనల్ మెడల్స్ ను కూడా సాధించింది. అంతేకాదండోయ్.. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్ వంటి రంగాల్లో కూడా శిక్షణ పొందింది.