
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. మోదీకున్న శక్తి, సామర్థ్యాలు ఇతరులతో కలుపుగోలుతనంగా ఉండటం ప్రపంచ వేదికపై భారతదేశ ప్రధాన ఆస్తులుగా మారాయని థరూర్ కొనియాడారు. ఈ క్రమంలో మోదీకి మరింత మద్ధతు అవసరమని ఆయన పేర్కొన్నారు. దౌత్యంలో మోదీ నాయకత్వంలోని సర్కారు విఫలమైందని, తద్వారా ప్రపంచలో డిప్లమసీలో ఒంటరిగా మిగిలిపోతోందంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్న వేళ ప్రధాని మోదీని ఆకాశానికెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాకిస్థాన్‌పై చేపట్టిన సైనిక చర్య గురించి ప్రపంచ దేశాలకు దౌత్యపరంగా వివరించడం కీలకమని తెలిపారు. అప్పుడే భారత్ ఉద్దేశం వారికి తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్ ఐక్యంగా ఉన్నప్పుడే అంతర్జాతీయ వేదికలపై తమ స్వరాన్ని గట్టిగా వినిపించగలదని చెప్పారు. వివిధ రాజకీయ పార్టీలు, పార్లమెంటు సభ్యులు కలిసి ప్రపంచ దేశాలకు శక్తిమంతమైన సందేశం ఇచ్చారని థరూర్ పేర్కొన్నారు.
‘‘జాతీయ సంకల్పం, వ్యక్తీకరణ శక్తి వెల్లడయిన సందర్భం అది. చాలా స్పష్టంగా ఐక్య భారత్ తన గొంతుకను వినిపించగలదని రుజువైంది. విదేశీ ప్రతినిధులను కలిసినప్పుడు మా బృందం పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ప్రతిస్పందించిన తీరును వివరించింది. పాక్ కూడా ఒక బృందాన్ని అమెరికాకు పంపినప్పుడు మేం అక్కడే ఉన్నాం. అయినా, ఉగ్రవాదం, పాకిస్థాన్ విషయంలో న్యాయబద్ధమైన భారత్ వైఖరిని వాస్తవాలతోను, నిర్దిష్ట సూచనలతోను అమెరికా ప్రతినిధుల ముందు ఉంచగలిగాం. ఉగ్రవాద సంస్థలపై గట్టి నిర్ణయం తీసుకోవాలని కోరాం’’ అని శశిథరూర్ వివరించారు.
శశిథరూర్ చేసిన వాఖ్యలపై బీజేపీ స్పందించింది. థరూర్ తన వ్యాఖ్యలతో రాహుల్ గాంధీ ఉద్దేశాలను ప్రజలకు తెలిసేలా చేశారని పేర్కొంది. ప్రధాని మోదీ విధానాలు భారత్‌కు వ్యూహాత్మకంగా మేలు చేస్తాయనే వాస్తవాన్ని శశిథరూర్ చెప్పారని తెలిపింది.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు