
ఒమన్ దేశం ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలలో భాగంగా ఆదాయంపై పన్ను వేయాలనుకుంటోంది. ఆదాయపన్నును 2028 నుంచి అమల్లోకి తీసుకురావాలని చూస్తోంది. అయితే అధిక సంపాదన ఉన్న వారి నుంచి మాత్రమే ఒమన్ పన్ను వసూలు చేయాలని భావిస్తోంది ఏడాదికి 42 వేల రియాల్స్ (అంటే 1.09 లక్ష డాలర్లు) కంటే ఎక్కువ సంపాదించేవారిపై 5 శాతం చొప్పున పన్ను వేయాలని ఒమన్ యోచిస్తోంది.
దాంతో పన్ను పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 1 శాతంగా ఉండవచ్చునని అంచనా వేస్తోంది. ఆదాయపన్ను అమల్లోకి వస్తే ఆదాయంపై పన్ను వేస్తున్న తొలి గల్ఫ్ దేశంగా ఒమన్ నిలువనుంది. కాగా గల్ఫ్ దేశాలకు ముడిచమురే ప్రధాన ఆదాయ వనరు. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్ (జిసిసి) లోని ఆరు దేశాలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నాయి. అయితే ఈ ఏడాది సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలు ద్రవ్యలోటు ఎదుర్కొనే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి.
అంతర్జాతీయంగా శిలాజ ఇంధనాలకు డిమాండ్ తగ్గుతున్నందున దీర్ఘకాలంలో ఆదాయపు పన్ను లాంటి సంస్కరణలు తీసుకురావాల్సిన అవశ్యకత ఉంటుందని ఐఎంఎఫ్ పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో చమురుపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ఒమన్ భావిస్తోంది. తద్వారా వచ్చే ఆదాయాన్ని సంక్షేమానికి వెచ్చించాలనుకుంటున్నట్లు ఒమన్ ఆర్థిక మంత్రి బిన్ మహ్మద్ అల్ సఖ్రి తాజాగా పేర్కొ్న్నారు.
జీసీసీలోని ఇతర దేశాలకు ఒమన్ తీసుకున్న నిర్ణయం ఆదర్శం కావొచ్చని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఆయా దేశాలు కూడా క్రమంగా ఆదాయ పన్నువైపు మళ్లే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఆదాయంపై పన్ను ఉండదన్న కారణంతోనే ఇతర దేశాల్లోని సంపన్న వర్గాలకు చెందిన వారు అక్కడ నివాసాలు ఏర్పరచుకుంటున్నారనడం వాస్తవదూరం కాదు.
.
More Stories
చైనాపై ట్రంప్ 100 శాతం అదనపు సుంకాలు
మైక్రోసాఫ్ట్ సలహాదారుగా రిషి సునాక్
జాన్సన్ & జాన్సన్ కు రూ.8 వేల కోట్ల జరిమానా!