
ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి బాధితుడిని తనేనంటూ బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. తన కుటుంబ సభ్యులు, డ్రైవర్లు, గన్మెన్లు ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ నేతలు ఈటల రాజేందర్, ప్రేమేందర్ రెడ్డి వాంగ్మూలాలను మంగళవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు నమోదు చేశారు.
2023 నవంబర్ ఎన్నికల సమయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వీరిద్దరి ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 4వేల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు సిట్ అధికారులు కనుక్కున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికతో పాటు అంతకుముందు, తర్వాత కూడా ఈటల ఫోన్ ట్యాపింగ్‌కి గురైనట్లు సిట్ గుర్తించింది.
అలాగే, 2020 నుంచి 2024 వరకు తన ఫోన్ సంభాషణలను రహస్యంగా తెలుసుకున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. కుట్ర పూరితంగా కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేసినట్లు సిట్‌కి తెలంగాణ టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెజండ్ల కిషోర్ బాబు ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలను సిట్ అధికారులకి కిషోర్ బాబు ఇచ్చారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు నత్తనడకన నడుస్తోందని ఈటల రాజేందర్ విమర్శించారు. అధికారులందరూ కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహారించారని ఆరోపించారు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు నిబంధనలు అతిక్రమించి కేసీఆర్ కోసం పనిచేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వలో అన్ని రంగాల్లోని ప్రముఖల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు.రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కును ఆటంకం కలిగించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. సంఘవిద్రోహ శక్తులవి కాకుండా నాయకులు ఫోన్లను కేసీఆర్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం దారుణమని ధ్వజమెత్తారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు, అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం దారుణమని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
హుజురాబాద్ ఎన్నికల్లో తన ఫోన్ ట్యాపింగ్‌కి గురైందని పేర్కొంటూ తాను ఎవరితో మాట్లాడినా తన మాటలను విని తన వారిని బెదిరించేవారని చెప్పుకొచ్చారు. తమ నాయకులకు సంబంధించిన అన్ని సంభాషణలు కూడా వినేవారని చెప్పారు. మునుగోడు ఉపఎన్నికలో ఎక్కడ ఉంటున, ఎవరితో మాట్లాడుతున్నాం, బీజేపీ ప్రణాళికలను కూడా పూర్తిగా వినేవారని తెలిపారు.
ఎన్నికల్లో గెలిచే దమ్ములేకే కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది కానీ దర్యాప్తు వేగంగా జరగడం లేదని రాజేందర్ పేర్కొన్నారు. తన రెండు ఫోన్లు ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశారని సిట్ అధికారులకు బీజేపీ సీనియర్ నేత ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఫోన్ ట్యాపింగ్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు
More Stories
మహిళా జర్నలిస్టులు లేకుండా ఆఫ్ఘన్ మీడియా సమావేశం
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
ఆర్ఎస్ఎస్: సైద్ధాంతిక పరిణామ శతాబ్దం