
భారత ప్రభుత్వ విధానాలు, వ్యూహాల్లో వచ్చిన మార్పు వల్లే రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత దిశగా అడుగులు పడుతున్నాయి. రక్షణ రంగ ఉత్పత్తుల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని భారత్ తగ్గించడాన్ని సానుకూల పరిణామంగా ‘కోటక్ మూచువల్ ఫండ్’నివేదిక అభివర్ణించింది. విదేశాల నుంచి రక్షణ ఉత్పత్తులను దిగుమతి చేసుకునే విషయంలో 2010 నాటికి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానంలో ఉన్న భారత్, 2024 నాటికి నంబర్ 4 స్థానానికి తగ్గిందని గుర్తు చేసింది.
అంతర్జాతీయ రక్షణ దిగుమతుల్లో 2010 నాటికి భారత్ వాటా 11 శాతం ఉండగా, 2024కల్లా అది 4 శాతానికి తగ్గిపోయిందని వెల్లడించింది. భారత్‌లో రక్షణరంగ ఉత్పత్తుల తయారీ, అభివృద్ధికి ప్రోత్సాహం లభిస్తున్నందు వల్లే విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గిందని నివేదిక తెలిపింది. రక్షణ ఉత్పత్తులను ఇతర దేశాలకు విక్రయించే స్థాయికి భారత్ ఎదిగిందని పేర్కొంది.
2010లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన రక్షణ రంగ ఉత్పత్తుల దిగుమతుల్లో భారత్ 11 శాతం, పాకిస్థాన్ 9 శాతం, ఆస్ట్రేలియా 6 శాతం, దక్షిణ కొరియా 5 శాతం వాటాలను కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది. ఆ ఏడాది సౌదీ అరేబియా, అమెరికా, సింగపూర్, చైనా చెరో 4 శాతం, అల్జీరియా, పోర్చుగల్ చెరో 3 శాతం మేర రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని పేర్కొంది.
రక్షణ రంగ దిగుమతుల్లోని మిగతా 47 శాతం వాటా ఇతరత్రా దేశాలకు చెందినదని ‘కోటక్ మూచువల్ ఫండ్’ వెల్లడించింది. 2024 సంవత్సర గణాంకాల ప్రకారం ప్రపంచంలోనే నంబర్ 1 ఆయుధాల దిగుమతిదారుగా ఉక్రెయిన్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన రక్షణ రంగ దిగుమతుల్లో 18 శాతం వాటా ఆ ఒక్క దేశానిదే. రెండో అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా రష్యా పొరుగునే ఉన్న నాటో కూటమి దేశం పోలాండ్ నిలిచింది.
ప్రపంచ రక్షణ దిగుమతుల్లో దీని వాటా 5 శాతం. 4 శాతం వాటాతో అగ్రరాజ్యం అమెరికా మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ రక్షణ దిగుమతుల్లో చెరో 4 శాతం వాటాతో భారత్, ఖతర్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో ఉన్నాయి. చెరో 3 శాతం వాటాతో జపాన్, పాకిస్థాన్ వంటి పలు దేశాలు ఐదో స్థానంలో ఉన్నాయి. 2010 తరహాలోనే 2024లోనూ మిగతా 47 శాతం ఆయుధాల దిగుమతి వాటా ఇతరత్రా దేశాల వద్దే ఉంది. విదేశీ ఆయుధాలు, రక్షణ ఉత్పత్తులను కొనడం తగ్గించినందు వల్ల ఎంతో విలువైన విదేశీ మారక ద్రవ్యం భారత్‌కు ఆదా అయిందని నివేదిక తెలిపింది.
ప్రత్యేకించి 2017 నుంచి భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తులకు ప్రపంచ దేశాల నుంచి ఆర్డర్లు పెరిగాయని పేర్కొంది. 2017 నుంచి 2024 వరకు విదేశాలకు భారత రక్షణరంగ ఎగుమతుల సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు అనేది 41 శాతానికి పెరిగిందని ‘కోటక్ మూచువల్ ఫండ్’ గుర్తు చేసింది. 2017 నాటికి నామమాత్రంగా ఉన్న భారత రక్షణరంగ ఎగుమతులు, 2024-25 ఆర్థిక సంవత్సరంకల్లా రూ.23,622 కోట్లకు పెరిగాయని తెలిపింది.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన