పాలన చేతగాక చేతులెత్తేసిన సీఎం రేవంత్‌ రెడ్డి

పాలన చేతగాక చేతులెత్తేసిన సీఎం రేవంత్‌ రెడ్డి
పాలన చేతగాక, హామీలు అమలు చేయలేక సీఎం రేవంత్‌ రెడ్డి చేతులెత్తేశారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి విమర్శించారు. అప్పులు ఇచ్చేవారు, తనను నమ్మేవారు లేరని బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. సోనియా మాటలు, ఆరు గ్యారెంటీలను నమ్మి కాంగ్రె్‌సకు ఓటు వేస్తే.. ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
 
మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్‌లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప సభలో మాట్లాడుతూ   మహిళలు, రైతులు, నిరుద్యోగులు, దళితులకు డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు. 
 
ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బలి అయిందని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా మొదలై రూ.లక్షల కోట్ల అప్పులపాలైందని విచారం వ్యక్తం చేశారు. అవినీతి, దోపిడీ, కుంభకోణాలు, అహంకారం, కుటుంబ పాలనతో తెలంగాణను దెబ్బతీశారని మండిపడ్డారు. నాలుగు కోట్ల మంది ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ విఫలమయ్యాయని ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని పేర్కొంటూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రాష్ట్రంలో కాషాయజెండా ఎగరడం ఖాయమని భరోసా వ్యక్తం చేశారు.
 
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు 11 ఏళ్లుగా నీతిమంతమైన, పారదర్శక, సమర్థ పాలన అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. విదేశీ, ఐటీ, రక్షణ రంగ ఎగుమతుల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ బలమైన ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందని తెలిపారు. నేడు ప్రపంచ దేశాలు ఏ సమావేశం నిర్వహించినా భారత ప్రధానిగా మోదీ ముందు వరుసలో నిలబడే స్థాయికి మన దేశం ఎదిగిందని పేర్కొన్నారు.
 
అమరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌ విమర్శించారు. కరోనాతో ప్రపంచమంతా విలవిల్లాడిన సమయంలో ప్రధాని మోదీ వ్యాక్సిన్ల తయారీని ప్రోత్సహించారని తెలిపారు. దేశ ప్రజలతో పాటు విదేశాలకు కూడా టీకాలు ఇచ్చిన ఘనత భారత్‌కు దక్కిందని చెప్పారు. 

మన దేశంలోని మేధోశక్తి విదేశాలకు వలస వెళ్లొద్దని భావించి ప్రధాని మోదీ మేకిన్‌ ఇండియా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. రూ.కోట్ల నిధులు ఇచ్చి స్టార్టప్‌ కంపెనీలను కేంద్రం ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, ఎంపీలు లక్ష్మణ్‌, డీకే అరుణ, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, పాల్వాయి హరీశ్‌, ఎమ్మెల్సీ అంజిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.