ఇటువంటి దాడి ప్రపంచంలో మరేసైన్యం చేయలేదు

ఇటువంటి దాడి ప్రపంచంలో మరేసైన్యం చేయలేదు

* 125కు పైగా యుద్ధ విమానాలతో ఆపరేషన్‌ మిడ్‌నైట్‌

ఇరాన్‌లోని మూడు కీలకమైన అణుకేంద్రాలపై అమెరికా ఆదివారం తెల్లవారు జామున విరుచుకుపడిన మిషన్‌కు ‘ఆపరేషన్‌ మిడ్‌నైట్‌ హామర్‌’ పేరు పెట్టినట్లుగా పెంటగాన్‌ తెలిపింది. ఈ ఆపరేషన్‌లో 125పైగా యూఎస్‌ యుద్ధ విమానాలు, మిస్సైల్స్‌ పాల్గొన్నాయని జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ జనరల్‌ డాన్‌ కేన్‌ ప్రకటించారు. ఇరాన్‌లోని ఫోర్డో, నటాంజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. 

యూఎస్‌ స్పేస్ కమాండ్, యూఎస్ సైబర్ కమాండ్, యూఎస్ స్ట్రాటజిక్ కమాండ్, యూరోపియన్ కమాండ్ వంటి అనేక ప్రధాన సైనిక విభాగాలు ఈ ఆపరేషన్‌లో కలిసిశాయని వివరించారు. 18 గంటల పాటు విమాన ప్రయాణం, గాలిలోనే అనేకసార్లు ఇంధనం నింపడం.. ఇలా ఖచ్చితమైన దాడి చేయడం ప్రపంచంలో మరే ఇతర సైన్యం ఇవన్నీ చేయలేవని స్పష్టం చేశారు. దాడి చాలా రహస్యంగానే జరిగిందని, ఇరాన్ రక్షణ వ్యవస్థకు దాడి జరుగుతోందని కూడా తెలియదని చెప్పారు. 

సాధారణ పౌరులకు హాని జరుగకుండా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు తెలిపారు. బాంబర్లు, ఫైటర్‌ జెట్లు, ట్యాంకర్లు, నిఘా విమానాలు సహా 125పైకిగా అమెరికన్‌ విమానాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని చెప్పారు. పశ్చిమాసియాలో భద్రత, శాంతిని కొనసాగించేందుకు ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి పీట్‌ హాగ్సేత్‌ పేర్కొన్నారు. కాగా, ఇరాన్‌ శాంతి మార్గాన్ని అవలంబించకపోతే, అమెరికా మరింత కఠినమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడదని హెచ్చరించారు.

ఇరానియన్ సైనికులు, ఇరానియన్ ప్రజలను లక్ష్యంగా దాడులు చేయలేదని స్పష్టం చేశారు. రాత్రి అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ అర్ధరాత్రి మూడు ఇరానియన్ అణు స్థావరాలు, ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్‌ అణు కేంద్రాలపై ఖచ్చితమైన దాడి చేసిందని, ఇది అద్భుతమైన విజయమని పేర్కొన్నారు. తమ కమాండర్ ఇన్ చీఫ్ నుంచి అందిన ఆదేశాల మేరకు అణుకేంద్రాలను నాశనం చేసినట్లు తెలిపారు. ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ప్రణాళిక ధైర్యంగా, అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.

అధ్యక్షుడు శాంతి గురించి మాట్లాడితే చర్చల కోసం 60 రోజులు సమయం ఇస్తారని,  కానీ, ఆ తర్వాత ఇరాన్‌ అణుకార్యక్రమం మనుగడ సాగించదని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ తయారీలో ఇజ్రాయెల్ సైతం కీలకపాత్ర పోషించిందని పీట్ హెగ్సేత్ తెలిపారు. చరిత్రలో తొలిసారిగా ఈ ఆపరేషన్‌లో ఎంవోపీ వంటి భారీ బాంబులను ఉపయోగించినట్లు తెలిపారు.ఈ బాంబులు 30వేల బరువు ఉంటాయని, వాటికి భూగర్భ బంకర్లను నాశనం చేయగలవని చెప్పారు. 

జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కేన్ మాట్లాడుతూ ఈ దాడి యూఎస్ సెంట్రల్ కమాండ్ జనరల్ ఎరిక్ కురిల్లా నాయకత్వంలో జరిగిందని తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అమెరికా నేల నుంచి ఏడు బీ-2 స్పిరిట్ బాంబర్లు టేకాఫ్ అయ్యాయని, ఈ విమానాలలో కొన్నింటిని ఉద్దేశపూర్వకంగా పసిఫిక్ మహాసముద్రం వైపు పంపారని, దాంతో ఇరాన్ గందరగోళానికి గురైందని తెలిపారు. 
 
ఆ తర్వాత తూర్పు నుంచి నిశ్శబ్దంగా ఇరాన్‌ సరిహద్దుల్లోకి ప్రవేశించాయని, ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించే కొద్దిసేపటి ముందు, యూఎస్‌ జలాంతర్గామి ఇస్ఫహాన్‌పై టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని రక్షణ మంత్రి హెగ్ సేత్ తెలిపారు. ఇరాన్ ఉపరితల రాడార్, క్షిపణి వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ దాడులు జరిగాయని, ఈ దాడిలో నాలుగు, ఐదోతరం యుద్ధ విమానాలు ముందుకు సాగుత ముప్పును తొలగించి మార్గాన్ని సిద్ధం చేశాయని చెప్పారు.
 
తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని.. కానీ, సవాల్‌ చేస్తే వెనక్కి తగ్గమని హెచ్చరించారు. అమెరికా యుద్ధాన్ని కోరుకోవడం లేదని, పౌరులు, మిత్రదేశాల ప్రయోజనాలకు ముప్పు వాటిల్లితే వెంటనే చర్యలు తీసుకుంటామని అమెరికా రక్షణ మంత్రి స్పష్టం చేశారు.