విమానాల ప్రత్యేక ఆడిట్‌ కోసం డీజీసీఏ సరికొత్త వ్యవస్థ

విమానాల ప్రత్యేక ఆడిట్‌ కోసం డీజీసీఏ సరికొత్త వ్యవస్థ
ఇటీవల జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తర్వాత విమానయానరంగంలో కీలకమైన మార్పులు చేసేందుకు డీజీసీఏ సన్నాహాలు చేస్తున్నది. ప్రస్తుతం సమగ్రమైన ప్రత్యేక ఆడిట్‌ కోసం సరికొత్త వ్యవస్థను ప్రారంభించాలని నిర్ణయించింది. దాంతో వ్యవస్థాగత బలహీనతలను చురుగ్గా గుర్తించడం సాధ్యం కానున్నది. ఈ ఆడిట్స్‌ అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రమాణాలు సరిగ్గా పాటిస్తున్నాయా? లేదా? తేలనున్నది. 
 
అలాగే, భారతదేశ జాతీయ విమానయాన నిబంధనలు సైతం ఖచ్చితంగా పాటించే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, ఎయిర్ ఇండియా డివిజనల్ వైస్ ప్రెసిడెంట్‌తో సహా తన ముగ్గురు అధికారులను సిబ్బంది షెడ్యూలింగ్, రోస్టరింగ్‌కు సంబంధించిన అన్ని రోల్స్‌ నుంచి, బాధ్యతల నుంచి తొలగించాలని ఆదేశించిన  డీజీసీఏ లైసెన్సింగ్, సౌకర్యం, ఆవిష్కరణ అవసరాల్లో లోపాలు ఉన్నప్పటికీ విమాన సిబ్బంది షెడ్యూలింగ్, ఆపరేషన్‌లో ఎయిర్ ఇండియా పదేపదే నిర్లక్ష్యం వహించిందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
ఏఆర్‌ఎంఎస్‌ నుంచి సీఏఈ విమాన-సిబ్బంది నిర్వహణ వ్యవస్థకు మారిన తర్వాత సమీక్ష సమయంలో ఈ నిర్లక్ష్యం గుర్తించారు. ఎయిర్ రూట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఏఆర్‌ఎంఎస్‌) అనేది వివిధ కార్యాచరణ, నిర్వహణ విధుల కోసం ఎయిర్‌లైన్ ఉపయోగించే సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్. ఇందులో సిబ్బంది జాబితా-విమాన ప్రణాళిక మొదలైనవి ఉంటాయి. కాగా, ఈ నెల 12న జరిగిన అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం ఘటనలో మొత్తంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వారం తర్వాత డీఎన్‌ఏ సరిపోలిన నేపథ్యంలో 215 మందిని గుర్తించగా,198 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు.