
వరుసగా తొమ్మిదో రోజైన శనివారం కూడా ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌లోని క్షిపణి కేంద్రాలు, ఇస్ఫాహన్ అణు కేంద్రంపై ఇజ్రాయిల్ శనివారం తాజాగా దాడులు జరిపింది. విదేశాల్లో మిలటరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ కమాండర్‌ను హతమార్చినట్లు ప్రకటించింది. ఆ కమాండర్‌ను మహ్మద్ సయీద్ ఇజాదిగా గుర్తించామని ఇజ్రాయిల్ రక్షణ శాఖ ప్రకటించింది.
హమాస్ వంటి గ్రూపులతో ఇరాన్ సంబంధాలను పర్యవేక్షించే ఇజాది, ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వర్గాలకు దీర్ఘకాలంగా లక్ష్యంగా వున్నారు. అక్టోబరు 7 దాడుల గురించి ముందుగా తెలిసిన అతికొద్ది మందిలో ఇజాది కూడా ఒకరు. సెంట్రల్ ఇరాన్‌లో ఇజాది నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌పై శనివారం తెల్లవారు జామున దాడిచేసి, హత్య చేసినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. వాయవ్య ఇరాన్‌లోని మిలటరీ సదుపాయాలపై ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు దాడులు కొనసాగిస్తున్నాయని మిలటరీ ప్రకటించింది.
శనివారం ఇరాన్ ప్రయోగించిన దాదాపు 40 డ్రోన్లను కూల్చివేసినట్ల ఇజ్రాయిల్ ఆర్మీ తెలిపింది. దాదాపు మూడు రోజులుగా ఇరాన్‌వ్యాప్తంగా ఇంటర్‌నెట్ దాదాపుగా స్తంభించిపోయింది. ఇరాన్‌కు చెందిన మరో ముగ్గురు కమాండర్లను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్‌కు చెందిన మరో ఇద్దరు కమాండర్లు కూడా తమ దాడుల్లో చనిపోయారని పేర్కొంది.
జర్మనీ ఓ వార్తాపత్రిక ‘ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడేన్ సార్ ఇజ్రాయెల్ దాడుల ప్రభావంతో ఇరాన్ అణు బాంబు తయారీ ప్రణాళికలో దాదాపు రెండు నుంచి మూడేళ్లు జాప్యం జరుగుతుందని తెలిపారు. ఇరాన్ నుంచి పొంచి ఉన్న అణు ముప్పును తొలగించేందుకు ఏమేం చేయాలో అన్నీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌పై తమ దాడి కొనసాగుతుందని తేల్చి చెప్పారు.
ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 350 మంది చనిపోయారని ఇరాన్ ఆరోగ్యశాఖ శనివారం ప్రకటించింది. మృతి చెందిన వారిలో మిలిటరీ కమాండర్లు, అణు శాస్త్రవేత్తలతో పాటు పెద్దసంఖ్యలో సాధారణ పౌరులు ఉన్నారని తెలిపింది. అయితే ఇరాన్‌లో చనిపోయిన వారి సంఖ్య 657కుపైనే ఉంటుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
శనివారం నాటి దాడుల్లో ఆక్రమిత పాలస్తీనా భూభాగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాదాపు 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని, పలు ఇజ్రాయిల్ నగరాలను డజన్ల సంఖ్యలో ‘విధ్వంసకర’ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. అనేక డ్రోన్లు తమ లక్ష్యాలను విజయవంతంగా ఛేదించాయని సమాచారం వచ్చినట్లు ఇర్నా తెలిపింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చి శనివారం తుర్కియేలోని ఇస్తాంబుల్‌కు చేరుకున్నారు. శని, ఆదివారాల్లో (జూన్ 21-22) అక్కడ జరగనున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) సభ్యదేశాల విదేశాంగ మంత్రుల 51వ సదస్సులో అబ్బాస్ అరగ్చి పాల్గొననున్నారు. ‘‘మారుతున్న ప్రపంచంలో ఓఐసీ’’ అనే థీమ్‌తో ఈసారి సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధమే ప్రధాన ఎజెండాగా ఉందని సమాచారం. అంతకుముందు శుక్రవారం రోజు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చితో యూకే, ఫ్రాన్స్, జర్మనీ దేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు.
అణు ఒప్పందం గురించి అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించాలని అరగ్చిని వారు కోరారు. దాడుల విరమణ అంశాన్ని పక్కన పెట్టి ఈ సైనిక ఘర్షణలోని అన్ని పక్షాలు (అమెరికా సహా) చర్చలను మొదలుపెడితే బాగుంటుందని ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారట్ తెలిపారు. ఈ సమావేశం తర్వాత అబ్బాస్ అరగ్చి ఇజ్రాయెల్ దాడులు కొనసాగినన్ని రోజులు, ఇక అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కాగా, ఇరాన్‌తో చర్చల కోసం, దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌కు చెప్పేది లేదని డోనాల్డ్ ట్రంప్ తేల్చి చెప్పారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు