డ్రగ్స్ ఉపయోగించమని మలయాళ చిత్రాల్లో హామీ ఇవ్వాలి

డ్రగ్స్ ఉపయోగించమని మలయాళ చిత్రాల్లో హామీ ఇవ్వాలి

మాదక ద్రవ్యాల వాడకాన్ని నియంత్రించేందుకు మలయాళ చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సినిమా అంగీకరించేటప్పుడే నటీనటులు ఎవరైనా సరే సెట్స్‌లో డ్రగ్స్‌ ఉపయోగించము అనే ఒక కొత్త అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. నటీనటులతో పాటు వారి సిబ్బంది.. చివరకు డ్రైవర్స్‌ కూడా ఇందులో భాగమే. వారందరూ సంతకాలు చేస్తేనే సెట్‌లోకి అడుగుపెట్టగలరని నిబంధనలు పెట్టారు. 

ఈ మేరకు మలయాళ సినీ అసోసియేషన్‌ నిర్ణయం తీసుకుంది.  షూటింగ్‌ లొకేషన్స్‌తోపాటు నిర్మాణాంతర పనులు జరిగే ప్రదేశాల్లోనూ ఇది నిబంధన వర్తిస్తుంది. సూపర్‌స్టార్స్‌  నుంచి చిన్నస్థాయి టెక్నీషియన్స్‌ వరకూ ఎవరూ దీనికి అతీతులు కారని నిర్మాతల మండలి తీసుకున్న ఈ నిర్ణయంపై అన్ని విభాగాల వారు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆదివారం ‘అమ్మ’ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీని గురించి చర్చించనున్నట్లు మలయాళ మీడియా కథనాలు రాసుకొచ్చింది.

డ్రగ్స్‌ వాడకంపై నిర్మాత సాండ్రా థామస్‌ ప్రస్తావిస్తూ మాదకద్రవ్యాల వాడకం పరిశ్రమలో నానాటికీ పెరుగుతుందని ఆరోపించారు. డ్రగ్స్‌ వాడకం కోసమే సెట్స్‌లో ప్రత్యేకంగా గదులు ఏర్పాటుచేస్తున్నారని ఆమె తెలిపారు. ఒక సినిమా సెట్స్‌లో ఓ నటుడు మాదక ద్రవ్యాల మత్తులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్‌ ఆరోపణ చేశారు. 

మరోవైపు, మాదక ద్రవ్యాల ఆరోపణలతో నటుడు షైన్‌ టామ్‌ చాకో తోపాటు కొంతమంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులను పోలీసులు కొన్నిరోజుల క్రితం అరెస్ట్‌ చేశారు.  డ్రగ్స్‌ వాడకం, క్యాస్టింగ్‌ కౌచ్‌, పని ప్రాంతంలో మహిళలపై ఆరాచకాలు వంటి కారణాలతో మలయాళ చిత్ర పరిశ్రమ తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామం ఎటువైపుకు దారితీస్తుందో చూడాలి.